Yashwant: జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwanth varma)ను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు (Supreme court) కొలీజియం సిఫార్సు చేసింది. ఈ నెల 20, 24 తేదీల్లో జరిగిన సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన బదిలీని సాధారణ ప్రక్రియ ప్రకారమే నిర్వహిస్తున్నట్టు తెలిపింది. యశ్వంత్ ఇంట్లో దొరికిన, కాలిపోయిన నోట్ల వివాదంతో ఈ బదిలీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ నెల 20న ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలనే ప్రతిపాదనను కొలీజియం పరిశీలించింది. దీనిపై వర్మ నుంచి ప్రతిస్పందన తీసుకున్న తర్వాత తీర్మానానికి ఆమోదం తెలిపింది. అయితే అంతకుముందు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని తీవ్రంగా నిరసిస్తున్నట్టు తెలిపింది. ఒక మీటింగ్ సైతం ఏర్పాటు చేసి జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం తీసుకురావాలని ప్రతిపాదించింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు యశ్వంత్ బదిలీకే మొగ్గు చూపింది.
కాగా, ఈనెల14న ఢిల్లీలోని యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సగం కాలిపోయిన కరెన్సీ నోట్లను భారీగా గుర్తించారు. ఈ ఘటనపై సీజేఐ సంజీవ్ ఖన్నా స్పందించారు. దీనిపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు చేశారు. కానీ తనపై వచ్చిన ఆరోపణలను యశ్వంత్ ఖండించారు. తన ఇంటిలో ఎన్నడూ నగదు ఉంచలేదని తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలోనే ఆయనను ట్రాన్స్ ఫర్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. జస్టిస్ వర్మ తొలిసారిగా 2016లో అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2021 అక్టోబర్‌లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.