2వేల వీసా అపాయింట్‌మెంట్లు రద్దు
వీసా దరఖాస్తు ప్రక్రియలో మోసాలను అరికట్టడానికే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.

- ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం నిర్ణయం
- బాట్స్ ఉపయోగించి బుకింగ్
- వీసా మోసాన్ని గుర్తించిన అమెరికా
దిశ, నేషనల్ బ్యూరో: బాట్ ఖాతాలను ఉపయోగించి మోసపూరితంగా బుక్ చేసుకున్న 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. మోసపూరిత వీసా అపాయింట్‌మెంట్ల పట్ల జీలో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తున్నట్లు తెలిపింది. షెడ్యూలింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన వారిని గుర్తించామని, ఆయా ఖాతాలను సస్పెండ్ చేసినట్లు అమెరికన్ రాయబార కార్యాలయం తెలిపింది. కాన్సులర్ టీమ్.. ఇండియా బాట్‌లు చేసిన 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేశాము. మా షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అధికారులు తెలిపారు. ఈ అపాయింట్‌మెంట్లను వెంటనే రద్దు చేయడమే కాకుండా.. వాటి అనుబంధ ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
వీసా దరఖాస్తు ప్రక్రియలో మోసాలను అరికట్టడానికే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అమెరికా బిజినెస్, విజిటర్స్, బీ1, బీ2, స్టూడెంట్ వీసాల అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ వెయిటింగ్ సమయం ఉంటుంది. అయితే ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తే మాత్రం కేవలం నెలరోజుల్లోనే షెడ్యూలింగ్ చేస్తున్నారు. ఇందు కోసం ఒక్కో వీసా దరఖాస్తుదారుడి నుంచి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. 2023లో బీ1, బీ2 అపాయింట్‌మెంట్ల కోసం 999 రోజుల వెయిటింగ్ పిరియడ్ చూపించింది. దీంతో భారతీయ దరఖాస్తుదారుల కోసం ఫ్రాంక్‌ఫర్ట్, బ్యాంకాక్ వంటి ఇతర ప్రదేశాల్లో అపాయింట్‌మెంట్లను అమెరికా అధికారులు ఓపెన్ చేశారు. 2024 మే నుంచి ఆగస్టు మధ్య యూఎస్ వీసాలు పొందడానికి మోసపూరిత పత్రాలు సమర్పించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు యూఎస్ ఎంబసీ ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే వీసా అపాయింట్మెంట్లను రద్దు చేయడం గమనార్హం.