భారత్ ఎదగకపోతే ప్రపంచ వినాశనమే: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
భారతదేశం నిరంతరం బలపడాలని ఒక వేళ ఏదైనా కారణం చేత ఎదగకపోతే అది ప్రపంచ వినాశనానికి దారి తీస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశం నిరంతరం బలపడాలని ఒక వేళ ఏదైనా కారణం చేత ఎదగకపోతే అది ప్రపంచ వినాశనానికి దారి తీస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర పూణే జిల్లాలోని అలండిలో జరిగిన గీతాభక్తి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన వేడుకను సాహసేపేతమైన చర్యగా అభివర్ణించారు. భగవంతుని ఆశీర్వాదం వల్లే రామమందిర నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. 500 ఏళ్ల సుధీర్ఘ పోరాటం అనంతరం ఈ కల నెరవేరిందని చెప్పారు. ‘భారత్ ఎంతో ఎత్తుకు ఎదగాలి. అంతేగాక బలంగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచానికి అది అవసరం. ఏ కారణం చేతనైనా బలపడకపోతే లేదా ప్రపంచం త్వరలోనే వినాశనాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. విశ్వ వ్యాప్తంగా ఉన్న మేధావులకు ఇది తెలుసు’ అని అన్నారు. భారత్ తన కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కాగా, అద్యాత్మిక గురువు శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్ 75వ జయంతి సందర్భంగా గీతా భక్తి అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నారు.