Building Collapse: ముంబైలో భవనం కూలి మహిళ మృతి

ముంబై (Mumbai) గ్రాంట్‌ రోడ్‌లోని భవనం పాక్షికంగా కూలిపోవడంతో మహిళ చనిపోయింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

Update: 2024-07-20 09:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై (Mumbai) గ్రాంట్‌ రోడ్‌లోని భవనం పాక్షికంగా కూలిపోవడంతో మహిళ చనిపోయింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద నలుగురు నలుగురు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. గత మూడ్రోజులుగా ముంబై, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం(Mumbai Rains) కురుస్తోంది. భారీ వర్షం వల్ల ఇల్లు కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. వర్షాల వల్ల కూలిపోయిన మొదటి పెద్ద ఇల్లు ఇదే అని అన్నారు. ఘటనాస్థలిలో పోలీసులు, అంబులెన్స్‌లు, పైరింజన్లతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. నాలుగు అంతస్తులున్న రూబినీసా మంజిల్‌ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లోని బాల్కనీతో పాటు కొన్ని భాగాలు కూలిపోయాయి. భవనం కూలే సమయంలో అందులో 35-40 మంది ఉన్నారు. వారందరినీ సురక్షితంగా అధికారులు బయటకు తరలించారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన ఒకరిని స్థానికులు కాపాడారు. ఇప్పటికీ భవనం ముందు భాగంలో కొంత భాగం ఇప్పటికీ ప్రమాదకరంగా వేలాడుతూనే ఉంది.

ముంబైలో వర్షాలు

ముంబైలో గతకొంతకాలంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలు రహదారులలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. పలు చోట్ల రైల్వే ట్రాక్‌లపైకి నీరు ప్రవేశించింది. ఫలితంగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు విలేపార్లేలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రానున్న రోజుల్లో ముంబయిలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.


Similar News