Mathura : ముస్లిం పక్షం పిటిషన్ కొట్టివేత.. శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో హైకోర్టు సంచలన నిర్ణయం

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తర‌ప్రదేశ్‌లోని శ్రీకృష్ణ జన్మభూమి మధురలో ఉన్న షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-01 16:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తర‌ప్రదేశ్‌లోని శ్రీకృష్ణ జన్మభూమి మధురలో ఉన్న షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. షాహీ ఈద్గా మసీదు భూమి హిందువులదే అంటూ దాఖలైన 18 పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై హిందూ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలన్న షాహి ఈద్గా మసీదు ట్రస్ట్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మయాంక్‌ కుమార్‌ జైన్‌ సారథ్యంలోని సింగిల్‌ బెంచ్ కొట్టివేసింది. ‘‘ప్రార్థనా స్థలాల చట్టం, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ చట్టం, పరిమితి చట్టం, నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టం ప్రాతిపదికన హిందూపక్షం పిటిషన్లను విచారించే అధికారం సివిల్ కోర్టుకు లేదు’’ అని షాహీ ఈద్గా మసీదు పక్షం చేసిన వాదనతో న్యాయస్థానం విభేదించింది. షాహి ఈద్గా మసీదు ట్రస్ట్ దాఖలు చేసిన ‘‘ఆర్డర్ 7, రూల్ 11’’ దరఖాస్తును హైకోర్టు రెజెక్ట్ చేసింది. అదే సమయంలో సివిల్ దావా నిర్వహణకు సంబంధించి హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం స్వీకరించింది.తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టుకు ఇరుపక్షాలు..

హైకోర్టు నిర్ణయాన్ని మధురలోని షాహీ ఈద్గా మసీదు ట్రస్టు సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. తాము కూడా సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్‌ను వేస్తామని హిందూపక్షం తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ వెల్లడించారు. ‘‘షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో పూజలకు అనుమతించాలి. మసీదులోని రెండున్నర ఎకరాల భూమి శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికే చెందుతుంది. మసీదు కమిటీ దగ్గర భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు’’ అని హిందూ వర్గానికి చెందిన పిటిషనర్లు వాదిస్తున్నారు. కాగా, 1968లో మధురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహీ మసీదు ఈద్గా ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. దాని కింద 10.9 ఎకరాలను శ్రీ కృష్ణ జన్మభూమికి.. మిగిలిన 2.5 ఎకరాల భూమిని షాహీ ఈద్గా మసీదుకు కేటాయించారు.

Tags:    

Similar News