చిరుత పులుల వరుస మరణాలపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్..

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుత పులుల వరుస మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Update: 2023-07-20 16:27 GMT

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుత పులుల వరుస మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మిగతా చీతాలను వెంటనే రాజస్థాన్‌కి తరలించాలని సూచించింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల సంరక్షణపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. "గత వారం కూడా ఇంకో రెండు చీతాలు చనిపోయాయి. అయినా దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా ఎందుకు తీసుకుంటున్నారు. వాటి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోండి.

ఈ చిరుతలను వేరు వేరుగా ఉంచకుండా.. అలా ఒకే చోట ఎందుకు ఉంచుతున్నారు. ఏడాది లోపే దాదాపు 40% చీతాలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది" అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మిగిలిన చీతాలకు రాజస్థాన్‌లోని జవాయ్ నేషనల్ పార్క్ ఆవాసయోగ్యంగా ఉంటుందో లేదో పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. చీతాల మరణాలకు గల కారణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు.


Similar News