Isha foundation: ఈశా ఫౌండేషన్ లో 150 మంది పోలీసుల సోదాలు

మద్రాస్ కోర్టు ఆదేశాలతో కోయంబత్తూరు తొండముత్తూర్‌లోని వెల్లియంగిరి పాదాలలోని ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో విచారణ చేపట్టారు.

Update: 2024-10-02 11:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మద్రాస్ కోర్టు ఆదేశాలతో కోయంబత్తూరు తొండముత్తూర్‌లోని వెల్లియంగిరి పాదాలలోని ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో విచారణ చేపట్టారు. కోయంబత్తూర్‌ రూరల్‌ డిస్ట్రిక్‌ అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే. కార్తికేయన్‌ నేతృత్వంలో ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్‌లు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు 150 మంది పోలీసు అధికారుల బృందం పర్యటించి, విచారణ చేపట్టింది. కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంలో మహిళలను సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జగ్గీ వాసుదేవ్‌ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలని కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్‌ కామరాజ్‌ మద్రాసు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులోనే విచారణ చేపట్టిన కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఈశా ఫౌండేషన్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

ఈశా ఫౌండేషన్ స్పందన

అయితే, ఈ పిటిషన్ పైనే ఈశా ఫౌండేషన్ స్పందించింది. పెళ్లి చేసుకోమని కానీ, సన్యాసులుగా మారాలని కానీ తాము ఎవరినీ అడగమని స్పష్టం చేసింది. అదంతా ఆయా వ్యక్తుల వ్యక్తిగత విషయమని తెలిపింది. ‘‘ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించడానికి ఈశా ఫౌండేషన్‌ను సద్గురు స్థాపించారు. అయితే, వ్యక్తులు వారికి నచ్చిన మార్గాలను ఎంచుకునేందుకు స్వేచ్ఛ, జ్ఞానం ఉంటాయని మేం నమ్ముతున్నాం. పెళ్లి చేసుకోవాలని గానీ, సన్యాసం స్వీకరించాలని గానీ మేం ఎవరినీ అడగం. ఇవన్నీ వారి వ్యక్తిగత విషయాలు. మా ఫౌండేషన్ లో వేలాదిమంది ఉన్నారు. వారెవరూ సన్యాసులు కాదు. అలాంటి వారు కొందరే ఉంటారు. అయినప్పిటకీ ఈ కేసులో పిటిషనర్ సన్యాసులను కోర్టు ముందు హాజరుకావాలన్నారు. వారు కోర్టుకు హాజరై తాము ఇష్టపూర్వకంగానే ఉంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఇది కోర్టు పరిధిలోకి చెందిన అంశం. సత్యం గెలుస్తుందని నమ్మకంతో ఉన్నాం. త్వరలోనే ఈ వివాదాలకు ముగింపు లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఈశా ఫౌండేషన్‌ వివరణ ఇచ్చింది.


Similar News