కీలక శాఖలు దక్కేదెవరికి?..మోడీ 3.0 తొలి కేబినెట్ భేటీపై ఉత్కంఠ

ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మోడీతో సహా 72 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

Update: 2024-06-10 05:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మోడీతో సహా 72 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే సోమవారం సాయంత్రం ప్రధాన మంత్రి ఆవాస్ లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నూతన ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో మంత్రులకు పోర్ట్ ఫోలియోల కేటాయింపు, ప్రభుత్వం ఏర్పాటైన తొలి 100 రోజుల రోడ్‌ మ్యాప్‌పై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ‘డెవలప్‌డ్ ఇండియా మిషన్’, ఎన్నికల్లో ప్రధాని మోడీ ఇచ్చిన హామీల అమలుపైనా డిస్కస్ చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కీలక శాఖలు ఎవరకి దక్కుతాయో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రక్షణ, హోం, విదేశాంగ మంత్రిత్వ శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అమిత్ షా, రాజ్‌నాథ్‌ల శాఖల్లో నో చేంజ్ !

గత ప్రభుత్వంలో హోం మంత్రిగా అమిత్ షా, రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్‌లు బాధ్యతలు నిర్వహించారు. అయితే కీలకమైన ఈ శాఖలు మరోసారి వారికే కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇక, మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ లకు కూడా పెద్ద బాధ్యతలు ఇవ్వనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. అలాగే ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) పార్టీలకు ఏ పదవి కేటాయిస్తారనే దానిపైనా ఆసక్తి నెలకొంది. ఆయా పార్టీలు కూడా పలు కీలక శాఖలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. జేడీయూ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైల్వే మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని ప్రతిపాదించగా..టీడీపీ జలవనరుల శాఖను ప్రధానంగా డిమాండ్ చేసినట్టు సమాచారం. మరోవైపు అమిత్ షా ఆర్థిక శాఖను చేపట్టవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

బిహార్, యూపీలకు ప్రాతినిథ్యం

కొత్త మంత్రివర్గంలో బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు గణనీయమైన ప్రాతినిధ్యం ఇవ్వబడింది. బిహార్ 8 క్యాబినెట్ బెర్త్‌లు దక్కించుకోగా.. ఉత్తరప్రదేశ్‌కు తొమ్మిది మంత్రి పదవులు లభించాయి. యూపీలో బీజేపీ సీట్లు దారుణంగా పడిపోవడంతో మళ్లీ పుంజుకునేందుకు బీజేపీ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏకంగా తొమ్మిది మందికి కేబినెట్ బెర్త్ దక్కింది. మరోవైపు బీజేపీ చీఫ్ నడ్డా పదవీ కాలం ముగియంనుండటంతో తదుపరి బీజేపీ అధ్యక్షుడిగానూ యూపీకి చెందిన వ్యక్తినే నియమించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రధాని మోడీ ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలోని సౌత్ బ్లాక్ కార్యాలయంలో మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం కేబినెట్ భేటీపై చర్చించనున్నారు.


Similar News