ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్..!
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ నియామకం కానున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ నియామకం కానున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు. దీనికి సుప్రీంలీడర్ ఖమేనీ ఆమోదం అవసరం. తర్వాత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగాధిపతితో కూడిన ఓ కౌన్సిల్‌ను ఏర్పాటుచేస్తారు. అందులో భాగంగానే 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాలి.
సెప్టెంబర్ 1, 1955లో ఇరాన్‌లోని డెజ్‌ఫుల్‌లో జన్మించిన మొఖ్బర్.. ప్రస్తుతం దేశ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2021లో రయీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మొఖ్బర్ మొదటి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. సుప్రీం లీడర్ ఖమేనీకి సన్నిహితుడిగా ఈయనకు పేరుంది.
1980ల్లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఐఆర్‌జీసీ మెడికల్ కోర్‌లో అధికారిగా ఉన్నారు. ఖుజెస్థాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు. టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ సహా పలు రంగాల్లో మొఖ్బర్ కు అనుభవం ఉంది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలో మాస్కోకు డ్రోన్లు, క్షిపణుల సరఫరా ఒప్పందాన్ని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2010లో అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యకలాపాల్లో ప్రమేయంపై యూరోపియన్ యూనియన్ నుంచి ఆంక్షలు కూడా ఎదుర్కొన్నారు.