జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రేయేసస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా మహమ్మారితో క్లిష్ట స్థితిలో ఉందని అన్నారు. మహమ్మారి తీవ్రమైన దశను అంతమొందించడానికి దేశాలన్నీ కలిసి పనిచేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం జర్మనీ అభివృద్ధి మంత్రితో పాటు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైరస్‌ను అంతం చేయడానికి తమ వద్ద అన్ని సాధనాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 'కోవిడ్-19 మహమ్మారి మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రపంచం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ మహమ్మారి తీవ్రమైన దశను అంతం చేయడానికి మనం కలిసి పని చేయాలి.
భయాందోళనలు, నిర్లక్ష్యం మధ్య ఉంటూ మహమ్మారిని ఇంకా కొనసాగించడానికి మేము అనుమతించలేము' అని అన్నారు. జర్మనీ అతిపెద్ద ఏజేన్సీ దాతగా మారిందని తెలిపారు. కాగా, మొత్తంగా చూసుకుంటే అన్ని దేశాల్లో యూఎస్ నుంచి అత్యధికంగా ఆర్థిక సహాయం అందించింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని అంతం చేయాలని జర్మనీ మంత్రి స్వెంజా షుల్జ్ ఉద్ఘాటించారు. దీనికోసం "భారీగా వేగవంతమైన, నిజంగా ప్రపంచ వ్యాక్సినేషన్ ప్రచారం" కోసం పిలుపునిచ్చారు.