వాట్సాప్ స్టేటస్.. రెండు గ్రూపుల మధ్య వివాదం
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో కొందరు యువకులు చేసిన వివాదాస్పద పోస్ట్‌లకు వ్యతిరేకంగా నిరసనకారులు బంద్‌కు, ఆందోళనలకు పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బంద్‌పిలుపును ఉపసంహరించుకోవాలన్న పోలీసుల సూచనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.
ఈ ఆందోళనల్లో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఔరంగజేబును పొగుడుతూ పోస్ట్ చేయడంపై రెండు గ్రూపుల మధ్య మతపరమైన వివాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో, కొల్హాపూర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా నియంత్రించేందుకు అదనపు పోలీసు బలగాలు, ఎస్‌ఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బృందాలను రప్పించారు.
ఐదుగురికి మించి ఒకచోట ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 19 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించారు. అయినప్పటికీ..పెద్దఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాగా, కొల్హాపూర్ ఆందోళనలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
‘ఔరంగజేబును పొగిడేవారికి మహారాష్ట్రలో క్షమాపణ లేదు. పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో శాంతిభద్రతలను కాపాడేలా చూడటం మా బాధ్యత, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖను ఆదేశించాను’ అని అన్నారు.