3 Calls : అస్వస్థత.. ఆత్మహత్య.. ఏది నిజం ?.. జూనియర్ వైద్యురాలి పేరెంట్స్‌కు అరగంటలో మూడు కాల్స్

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగుచూశాయి.

Update: 2024-08-29 18:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. ఈ దురాగతానికి పాల్పడిన వారు ఎవరు ? అనేది సీబీఐ విచారణలో తేలుతుంది. అయితే జూనియర్ వైద్యురాలు ఆగస్టు 9న మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో దారుణ స్థితిలో చనిపోయింది. దీనిపై ఆమె తల్లిదండ్రులకు ప్రాథమిక సమాచారాన్ని అందించే సమయంలో కాలేజీ అధికార వర్గాలు, సిబ్బంది వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది. తాజాగా బయటికొచ్చిన మూడు ఆడియో క్లిప్పులతో ఈ విషయం స్పష్టమవుతోంది. ఆగస్టు 9న తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో కాలేజీలోని సెమినార్ హాలులో హత్యాచార ఘటన జరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులకు ఉదయం 10.53 గంటలకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించడం గమనార్హం. మొత్తం మీద అరగంట వ్యవధిలో కాలేజీ నుంచి వేర్వేరు వ్యక్తులు మూడుసార్లు కాల్స్ చేసి సమాచారం ఇచ్చారు. వివరాలివీ..

మొదటి కాల్..

ఆర్జీ కర్‌ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు చెందిన సిబ్బంది ఒకరు తొలుత జూనియర్ వైద్యురాలి పేరెంట్స్‌కు కాల్ చేశారు. ‘‘మీ కుమార్తె అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి రాగలరా?’’ అని అడిగారు. దీంతో అనుమానించిన విద్యార్థిని తండ్రి.. ‘‘మా అమ్మాయికి ఏమైంది’’ అని అడిగారు. ‘‘మీరు ఇక్కడికి వస్తే ఏం జరిగిందో డాక్టర్లు చెబుతారు’’ అని చెప్పి ఫోన్ పెట్టేశారు.

రెండో కాల్..

మొదటి కాల్ చేసిన కొన్ని నిమిషాలకే కాలేజీ నుంచి జూనియర్ వైద్యురాలి పేరెంట్స్‌కు మరో కాల్ వెళ్లింది.‘‘మీ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా రండి’’ అని కాలేజీ సిబ్బంది ఒకరు చెప్పారు. దీంతో జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురయ్యారు. ‘‘అసలు మీరెవరు ?’’ అని వారు ప్రశ్నించారు. దీంతో కాలేజీ నుంచి ఫోనులో మాట్లాడుతున్న వ్యక్తి తాను ఆస్పత్రి అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ అని బదులిచ్చాడు. జూనియర్ వైద్యురాలి పేరెంట్స్ ఫోనులోనే మరింత సమాచారం అడిగేందుకు యత్నించగా.. ఆస్పత్రి అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ నుంచి సమాధానం రాలేదు. కాల్ కట్ అయింది.

మూడో కాల్..

ఇంకొన్ని నిమిషాల తర్వాత కాలేజీ నుంచి జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులకు మరో ఫోన్ కాల్ వచ్చింది.‘‘మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయినట్లుంది. పోలీసులు వచ్చారు. అందరం ఇక్కడే ఉన్నాం’’ అని ఓ వ్యక్తి ఫోనులో చెప్పాడు.

ఇద్దరు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు లై డిటెక్టర్ పరీక్ష

ఈ కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు గురువారం లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. కాలేజీలో దురాగతం చోటుచేసుకున్న సమయంలో వీరిద్దరు కూడా విధుల్లో ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అందుకే ఆ ఇద్దరి వాంగ్మూలాన్ని నమోదు చేసే క్రమంలోనే లై డిటెక్టర్ పరీక్షను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కేసు సెప్టెంబర్ 2న మరోసారి సుప్రీం కోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది.


Similar News