Chirag Paswan: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్‌: చిరాగ్ పాశ్వాన్

బాధితులుగా మిగిలిన అణగారిన వర్గాల ఉన్నతికి తెచ్చిన ఎస్సీ కోటాను ఉపవర్గీకరిస్తే అసలు ప్రయోజనాలు నెరవేరవు.

Update: 2024-08-04 16:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఉపవర్గీకరణను రాష్ట్రాలకు అనుమతిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై లోక్ జనశక్తి పార్టీ(రాంవిలాస్) నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అప్పీల్ చేస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చిరాగ్ పాశ్వాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 'షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి 'అంటరానితనం' ప్రాతిపదిక అని, బాధితులుగా మిగిలిన అణగారిన వర్గాల ఉన్నతికి తెచ్చిన ఎస్సీ కోటాను ఉపవర్గీకరిస్తే అసలు ప్రయోజనాలు నెరవేరవు. సుప్రీంకోర్టు తన తీర్పులో అంటరానితనం అనే మాటను ప్రస్తావించకపోవడం ఆశ్చర్యమనిపించింది. చదువుకునే అవకాశం ఉన్నటువంటి సంపన్నులైన దళితులు సహా ఎస్సీల్లో చాలామంది అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారు. ఉపవరీకరణ ద్వారా వారికి న్యాయం దక్కదని ' చిరాగ్ పాశ్వాన్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని, ఆ డేటాను బహిర్గతం చేయనవసరంలేదని ఆయన తెలిపారు. దళితుల కోటాలో క్రిమీలేయర్‌ను వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. రిజర్వేషన్‌లో రిజర్వేషన్లు సరైనవి కావు, ఎందుకంటే నేటికీ దళిత యువత అనేక అడ్డంకులను ఎదుర్కొంటోందని చిరాగ్ పాశ్వాన్ ఆదివారం విలేకరులతో అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. 

Tags:    

Similar News