‘అవసరమైతే మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తాం’

మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూరప్ప 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే.

Update: 2024-06-13 10:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూరప్ప 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీఐడీ విచారిస్తుండగా, బుధవారం లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని యడ్యూరప్పకు సీఐడీ సమన్లు పంపింది. అయితే తాను ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న విచారణకు హాజరవుతానని బదులిచ్చారు. తాజాగా ఈ కేసుపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర గురువారం మాట్లాడుతూ, అవసరమైతే పోక్సో కేసులో యడ్యూరప్పను అరెస్ట్‌ చేస్తామని, దీనిపై రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

మరోవైపు అరెస్టు భయంతో, యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఒక కేసు విషయంలో సహాయం చేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరి 2న యడ్యూరప్పను కలిసినప్పుడు 17 ఏళ్ల తన కూతురిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, బాలిక తల్లి మార్చి 14న సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీనియర్ బీజేపీ నాయకుడిపై పోక్సో చట్టం, IPC సెక్షన్ 354A (లైంగిక వేధింపులు) కింద అభియోగాలు మోపారు.

అయితే, యడ్యూరప్ప ఈ ఆరోపణలను తిరస్కరించారు, వాటిని "నిరాధారమైనవి" అని అన్నారు. ఈ కేసు గురించి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ.. చట్టం అందరికీ సమానమే, పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటారు. ఆయన దోషి అని నేను అనను. చట్టానికి అందరూ సమానం. చట్టం కంటే ఎవరూ పెద్దవారు కాదు అని అన్నారు. యడ్యూరప్ప 2008-2011 మధ్య, 2018లో కొద్దికాలం, మళ్లీ 2019-2021లో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Tags:    

Similar News