ప్రతి భారతీయుడికి నాణ్యతతో కూడిన అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణకు మేము కట్టుబడి ఉన్నాము: ప్రధాని మోడీ ట్వీట్
బుధవారం నిర్వహించిన కేంద్ర కేబినెట్ మీటింగ్ (Cabinet Meeting)లో కీలక నిర్ణయాలు తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: బుధవారం నిర్వహించిన కేబినెట్ మీటింగ్ (Cabinet Meeting)లో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) అమలు చేసేందుకు కేబినెట్ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశంలో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల(Senior Citizens)కు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం లభించనుంది. కాగా ఈ రోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై భారత ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌లో "ప్రతి భారతీయుడికి అందుబాటు ధరలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. 70 సంవత్సరాలకు పైబడిన పౌరులందరికీ ఆరోగ్య కవరేజీని అందించడానికి ఆయుష్మాన్ భారత్ PM-JAY యొక్క పరిధిని మరింత విస్తరించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం 6 కోట్ల మంది ప్రజలకు గౌరవం, సంరక్షణ, భద్రతను అందిస్తుంది" అని ప్రధాని తన ట్వీట్ లో రాసుకొచ్చారు.