Wayanad Tragedy: వయనాడ్‌లో 250 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు..కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్
వయనాడ్‌లోని మెప్పాడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 250 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్‌లోని మెప్పాడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 250 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. 300 మంది సిబ్బందిని ఘటనా ప్రాంతంలో మోహరించినట్టు చెప్పారు. మంగళవారం ఆయన రాజ్యసభలో ఈ వివరాలను వెల్లడించారు. ఇదొక విషాద ఘటన అని అభివర్ణించారు. ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయాలని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్‌ను ఆదేశించినట్టు తెలిపారు. అమిత్ షా సైతం కేరళ సీఎంతో మాట్లాడి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారన్నారు. అనేక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయని తెలిపారు. ఘటనా స్థలంలో రెండు హెలికాప్టర్లను మోహరించాలని చూసినప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ ల్యాండింగ్ చేయలేకపోయారని గుర్తు చేశారు.