Waqf panel: వక్ఫ్ మీటింగ్‌లో మరోసారి రచ్చ.. ఢిల్లీ బోర్డ్ ఆదేశాలు చట్టవిరుద్దమన్న ప్రతిపక్షాలు
వక్ఫ్ బిల్లు సవరణపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ మంగళవారం మరోసారి సమావేశమైంది.
దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ బిల్లు (waqf bill) సవరణపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (jpc) మంగళవారం మరోసారి సమావేశమైంది. అయితే ప్రతిపాదిత సవరణలకు ఢిల్లీ వక్ఫ్ బోర్డు(Delhi waqf Board) మద్దతు ఇవ్వడంతో మరోసారి గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ అశ్విని కుమార్ బిల్లుకు మద్దతు ఇచ్చారని, ఆయన స్టాండ్ చట్టవిరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ వక్ఫ్ బోర్డు నిర్వాహకులు ముస్లింలు కాదని, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండొద్దని చట్టం చెబుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ(Aap) వాదించినట్టు సమాచారం. అయితే అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) సీఎంగా ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డుకు హిందూ అడ్మినిస్ట్రేటర్‌ను నియమించారని బీజేపీ ఎంపీ ఒకరు సమావేశం దృష్టికి తీసుకురాగా వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ప్రజెంటేషన్‌ను పరిశీలించలేదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీ సీఎం అతిశీ ఆమోదం లేకుండా ప్రాధమిక నివేదికలో మార్పులు చేశారని ఆరోపించారు. కాగా, తాజా సమావేశంలో హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్‌ల నుంచి ప్రతినిధులను జేపీసీ ఆహ్వానించింది.