Waqf Land: వక్ఫ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలి.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు
వక్ఫ్ భూముల వివాదంపై పలువురు రైతులకు జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ భూముల(Waqf lands) వివాదం నేపథ్యంలో కర్నాటకలోని పలువురు రైతులకు జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) శనివారం ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, కర్నాటక వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం సీఎం ఈ ఆర్డర్స్ ఇచ్చారు. రైతులెవరూ ఎలాంటి ఇబ్బందులు పడొద్దని, ఈ విషయమై పుకార్లు పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. రైతులను వేధించొద్దని, వారి ఆధీనంలో ఉన్న భూములకు సంబంధించి ఎలాంటి సమస్య తలెత్తకుండా సమస్యను పరిష్కరించాలని సూచించారు. అలాగే ముందస్తు నోటీసులు లేకుండా భూ రికార్డుల్లో మార్పులు చేసినట్టయితే వాటిని వెంటనే రద్దు చేయాలని వెల్లడించారు.
జనతాదళ్ సెక్యులర్(Jds), బీజేపీ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వక్ఫ్ సమస్యను ఉపయోగించు కుంటున్నాయని ఆరోపించారు. వారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని తెలిపారు. అంతకుముందు కర్నాటక హోం మంత్రి పరమేశ్వర (Parameshwara) మాట్లాడుతూ వక్ఫ్ చట్టం కింద రైతులకు నోటీసులు జారీ చేయొద్దని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించామన్నారు. రెవెన్యూ రికార్డులనే అంతిమంగా పరిగణిస్తామని, వాటికి కట్టుబడే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
కాగా, రాష్ట్రంలోని విజయపుర, కలబురగి, బీదర్, శివమొగ్గ ప్రాంతాలకు చెందిన ముస్లిం రైతుల భూమిని వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటిస్తూ అధికారులు ఇటీవల నోటీసులు పంపారు. ఆ భూములను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. దీంతో రైతులు తీవ్ర నిరసనలు తెలిపారు. నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన సిద్ధరామయ్య వాటిని ఉపసంహరించుకోవాలని తెలిపారు.