అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన మేఘాలయ గవర్నర్.. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్
మేఘాలయాలో బడ్జెట్ సెషన్లో ప్రారంభ రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
షిల్లాంగ్: మేఘాలయాలో బడ్జెట్ సెషన్లో ప్రారంభ రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం గవర్నర్ ఫగు చౌహన్ ప్రసంగాన్ని హిందీలో చదవడం వివాదానికి దారి తీసింది. వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ప్రారంభంలో వీపీపీ శాసనసభ్యుడు అర్డెంట్ మిల్లర్ బసాయావ్‌మోయిట్‌కు సీఎం కాన్రాడ్ సంగ్మాతో వాగ్వాదం చోటు చేసుకుంది. మేఘాలయ హిందీ మాట్లాడే రాష్ట్రం కాదని, హిందీలో గవర్నర్ ప్రసంగం ప్రజల మనోభావాలకు విరుద్ధమని బసాయావ్ వాదించారు.
అయితే ఎన్నికైన ఎమ్మెల్యే నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదని సీఎం సంగ్మా అన్నారు. తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని రుద్దే ప్రయత్నాల నేపథ్యంలో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. అయితే అసెంబ్లీ స్పీకర్ థామస్ ఎ సంగ్మా ఆంగ్లంలో లిఖితపూర్వక ప్రసంగం సభ్యులందరికీ పంపిణీ చేయడంతో గవర్నర్‌ను హిందీలో ప్రసంగించడానికి అనుమతించానని చెప్పారు.