ఆరో విడత పోలింగ్ 59.05 శాతమే.. టాప్ పాయింట్స్ ఇవే

దిశ, నేషనల్ బ్యూరో : దేశ సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. శనివారం రోజు ఆరో విడత పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది.

Update: 2024-05-25 16:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశ సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. శనివారం రోజు ఆరో విడత పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు 59.05 శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్‌లో అత్యధికంగా 78.19 శాతం పోలింగ్ జరగగా, జమ్మూకశ్మీర్‌లో అత్యల్పంగా 52.28 శాతం ఓటింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 54.48 శాతం, జార్ఖండ్‌లో 62.74 శాతం, ఒడిశాలో 60.07 శాతం, హర్యానాలో 58.37 శాతం, బిహార్‌లో 53.30 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 54.03 శాతం ఓటింగ్ నమోదైంది. ఆరో విడత ఎన్నికల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఈవిడతలోనే హర్యానాలోని కర్నాల్‌ అసెంబ్లీ స్థానానికి బై పోల్‌, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకుగానూ ఆరో విడతతో కలుపుకొని 486 సీట్లకు పోలింగ్‌ పూర్తయ్యింది. చివరిదైన ఏడో దశ పోలింగ్‌ జూన్‌ 1న జరగనుంది.ఇందులో భాగంగా ఎనిమిది రాష్ట్రాల్లోని 57 స్థానాల్లో ఓట్ల పండుగ జరగనుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

బెంగాల్‌లో బీజేపీ అభ్యర్థి కాన్వాయ్‌పై దాడి

పోలింగ్‌ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా పలుచోట్ల టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. జార్‌గ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి ప్రణత్ టుడు కాన్వాయ్‌పై దాడి జరిగింది. గర్బెటాలోని పోలింగ్ బూత్‌ వద్ద ఓటర్లను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి ప్రణత్ టుడు అక్కడికి వెళ్లగా.. కొంత మంది వ్యక్తులు ఆయనపైకి రాళ్లు రువ్వారు.దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘర్షణలో బీజేపీ అభ్యర్థి కారు ధ్వంసమైంది. గర్బెటాలోని పోలింగ్ బూత్ వెలుపల ఓటు వేయడానికి వేచి ఉన్న మహిళపై బీజేపీ అభ్యర్థి సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారని టీఎంసీ ఆరోపించింది. ఘటల్, కంఠిలో అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఘటల్‌లో టీఎంసీ గూండాలు ఓటింగ్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించినట్లు బీజేపీ అభ్యర్థి హిరాన్ ఛటర్జీ ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పూంచ్‌ జిల్లాలో ఇరుపార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు గాయపడ్డారు.

ఓటు వేసిన ప్రముఖులు ఎవరంటే..

ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో ఓటు వేసిన ప్రముఖుల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, సీజేఐ డీవై చంద్రచూడ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, ప్రియాంకాగాంధీ కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్‌ వాద్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫ్యామిలీతో కలిసి చాందినీ చౌక్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. తూర్పు ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్, కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు ఢిల్లీలోనే ఓటుహక్కు వినియోగించుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)​ జనరల్ అనిల్ చౌహాన్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్, క్రికెటర్ కపిల్ దేవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హస్తినలో ఓటు వేశారు. పారిశ్రామికవేత్త, బీజేపీ అభ్యర్థి నవీన్‌ జిందాల్‌ కుటుంబంతో కలిసి హర్యానాలోని కురుక్షేత్రలో ఓటు వేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ రాంచీలో, మహేంద్ర సింగ్ ధోనీ రాంచీలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Tags:    

Similar News