వియత్నాంలో బిలీయనీర్‌కు మరణశిక్ష
సైగాన్ కమర్షియల్ బ్యాంకులో రూ. 2.25 లక్షల కోట్లు మోసం చేయడంతో మరణశిక్ష విధించారు.
దిశ, నేషనల్ బ్యూరో: వియత్నాంకు చెందిన బిలీయనీర్, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్‌కు మరణశిక్ష పడింది. వియత్నాంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం చేసిన కేసులో ఆమె దోషిగా తేలడంతో మరణిశిక్ష విధిస్తున్నట్టు హోచిమిన్ నంగరంలోని కోర్టు తీర్పు ఇచ్చినట్టు అక్కడి మీడియా ప్రచురించింది. వాన్ థిన్ ఫాట్ హోల్డింగ్ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా ఉన్న ట్రూంగ్ మై లాన్, ఆమె ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంకులో మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 27 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 2.25 లక్షల కోట్ల) మోసం చేసినట్టు సమాచారం. స్థానిక మీడియా కథనాల ప్రకారం సైగాన్ కమర్షియల్ బ్యాంకు నుంచి ఆమె 44 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 3.66 లక్షల కోట్లు రుణం తీసుకున్నారు. అందులో రూ. 2.25 లక్షల కోట్లు వెనక్కి రాకపోవచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు మోసాలలో ఒకటిగా ఈ వ్యవహారం బయటపడటంతో, ఈ కేసులో దోషిగా తేలిన బిలియనీర్‌కు మరణశిక్ష విధించారు.
2012 నుంచి 2022 మధ్య ఒక దశాబ్దం పాటు సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంకును ట్రూంగ్ మై లాన్ చట్టవిరుద్ధంగా నిర్వహించారు. ఆ సమయంలో నగదు కొరత ఉన్న మూడు చిన్న బ్యాంకులను ఒక పెద్ద సంస్థగా విలీనం చేసుకోవడానికి ఆమెకు అనుమతి లభించింది. తద్వారా సైగాన్ కమర్షియల్ బ్యాంకు ఏర్పడింది. కానీ, ఎవరికైనా ఏ బ్యాంకులోనైనా 5 శాతం కంటే ఎక్కువ షేర్లు ఉండేందుకు వియత్నాం చట్టం అనుమతించదు. దాంతో సైగాన్ కమర్షియల్ బ్యాంకులో 90 శాతం షేర్ల కోసం ట్రూంగ్ మై లాన్ వందల సంఖ్యలో షెల్ కంపెనీలు, బినామీలను సృష్టించుకున్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపణలు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చి, నకిలీ కంపెనీలకు భారీగా సొమ్మును మళ్లించారు. 2018లో సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంకు నష్టాల్లో ఉందనే సాకుతో 2022, అక్టోబర్ వరకు వియత్నాం ప్రభుత్వం ఆ బ్యాంకుకు ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చింది. కానీ, ఆ నిధులను ట్రూంగ్ మై లాన్ దారి మళ్లించి షెల్ కంపెనీలకు చేర్చారు.
2022లో వియత్నాం అవినీతి నిరోధక చర్యలు కఠినతరం కావడంతో అదే ఏడాది అక్టోబర్‌లో ఆమె వ్యవహారం బయటపడింది.
ట్రూంగ్ మై లాన్ గురించి..
ట్రూంగ్ మై లాన్.. హోచిమిన్ సిటీలోని సైనో-వియత్నామీస్ కుటుంబానికి చెందినవారు. తొలినాళ్లలో ట్రూంగ్ తన తల్లితో కలిసి బ్యూటీ ఉత్పత్తులను విక్రయించే స్టాల్ ద్వారా కెరీర్ మొదలుపెట్టారు. 1986లో వచ్చిన ఆర్థిక సంస్కరణలతో ట్రూంగ్ భూములు, భవనాలను కొన్నారు. 1990ల సమయంలో ట్రూంగ్ భారీగా సంపాదనతో హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. 2011 నాటికి ఆమె హోచిమిన్ నగరంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు.