Sitharaman : నేను రాజీనామా చేయాలా ?.. సీఎం సిద్ధరామయ్యపై ఆర్థికమంత్రి నిర్మల ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలో జరిగిన మహర్షి వాల్మీకి కార్పొరేషన్ స్కాంకు బాధ్యత వహిస్తూ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలో జరిగిన మహర్షి వాల్మీకి కార్పొరేషన్ స్కాంకు బాధ్యత వహిస్తూ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి పాల్పడిన బ్యాంకు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె సిద్ధరామయ్యను ప్రశ్నించారు. ఆదివారం బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ తరుచూ ‘న్యాయ్’(జస్టిస్) గురించి మాట్లాడుతోంది.. వాల్మీకి సామాజిక వర్గానికి కేటాయించాల్సిన రూ.88 కోట్ల నిధులను అక్రమంగా దారి మళ్లించడాన్నే ‘న్యాయ్’ అని భావించాలా ?’’ అని ఆమె ప్రశ్నను సంధించారు.
‘‘వాల్మీకి కార్పొరేషన్ నిధులను దారిమళ్లించే క్రమంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఓ జాతీయ బ్యాంకు అధికారులు సహాయ సహకారాలను అందించారు. వారిని కాపాడేందుకే మొత్తం వ్యవహారాన్ని సీఎం సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నారు. ఈక్రమంలోనే నన్ను రాజీనామా చేయమని అడుగుతున్నారు’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సీఎం స్థాయిలో ఉన్న సిద్ధరామయ్య ఈవిధంగా బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదన్నారు. ముందుగా ఈ స్కాంలో భాగస్తులైన బ్యాంకు అధికారులను అరెస్టు చేయించి.. ఆ తర్వాత తన రాజీనామా గురించి మాట్లాడాలని సీఎం సిద్ధరామయ్యకు ఆమె హితవు పలికారు. ‘‘ఈ స్కాం వ్యవహారంలో ఓ కీలకమైన కర్ణాటక మంత్రి ఇంకా రాజీనామా చేయలేదు. వాల్మీకి కార్పొరేషన్‌కు చెందిన రూ.88 కోట్ల నిధుల్లో చాలా భాగం ప్రైవేటు అకౌంట్లలోకి వెళ్లాయనే అభియోగాలు ఉన్నాయి. అసలు నిజాలను నిగ్గుతేల్చాలి’’ అని నిర్మల డిమాండ్ చేశారు.