న్యూరాలింక్ ప్రయోగంలో మరో ముందడుగు.. రెండో రోగికి..!
న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ని మరో వ్యక్తికి అమర్చేందుకు అనుమతించింది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.
దిశ, నేషనల్ బ్యూరో: న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ని మరో వ్యక్తికి అమర్చేందుకు అనుమతించింది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరాలింక్ ఇప్పటికే ఒక వ్యక్తికి బ్రెయిన్ చిప్ అమర్చింది. అయితే చిప్ అమర్చిన తొలి వ్యక్తికి ఎదురైన సమస్యలకు పరిష్కారం అందించినట్లు తెలిపింది.
న్యూరాలింక్ తన తొలి పేషెంట్ బ్రెయిన్ లోని చిప్ లో కొన్ని మార్పులు చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. చిప్ ఇంప్లాంట్ లో కొన్ని మార్పులు చేయడం ద్వార సమస్యను పరిష్కరించాలని కంపెనీ భావిస్తోంది. న్యూరాలింక్ ఈ ఏడాది ప్రారంభంలో ఓ వ్యక్తికి మొదటిసారిగా వైర్‌లెస్ బ్రెయిన్ చిప్‌ను అమర్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ లో వెల్లడించారు ఎలాన్ మస్క్.
న్యూరాలింక్ ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’ (బీసీఐ) సాంకేతికతతో పనిచేస్తుంది. మనుషులపై ప్రయోగాలు జరిపేందుకు అవసరమైన అనుమతుల కోసం అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ’ నుంచి అనుమతి పొందింది. గతేడాది సెప్టెంబర్ లో న్యూరోటెక్నాలజీ సంస్థ హ్యూమన్ ట్రయల్ రిక్రూట్ మంట్ ను ప్రారంభించింది. హ్యూమన్ ట్రయల్ లో భాగంగా శస్త్రచికిత్స తర్వాత వ్యక్తికి చిప్ ని ఇంప్లాంట్ చేశారు. ఇంప్లాంట్‌లో సమస్యలు ఉన్నాయని న్యూరాలింక్ వెల్లడించింది. ఫిబ్రవరిలో ఆ వ్యక్తి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది.
గతంలో న్యూరాలింక్ జంతువులపై విస్తృతమైన పరీక్షలు నిర్వహించింది. సక్సెస్ రేటు అధికంగా ఉండంటంతో.. మానవులపై ప్రయోగాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో గతేడాది నుంచి మానవులపై ప్రయోగాలు చేపట్టింది.