భారత్-రష్యాలను విడదీసేందుకు అమెరికా కుట్ర: మాస్కో రాయబారి డెనిస్ అలీపోవ్
భారత్, రష్యాల ద్వైపాక్షిక సంబంధాలను విడదీసేందుకు అమెరికా కుట్ర పన్నుతోందని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ ఆన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత్, రష్యాల ద్వైపాక్షిక సంబంధాలను విడదీసేందుకు అమెరికా కుట్ర పన్నుతోందని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ ఆన్నారు. తమ దేశం భారత్‌కు నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు. యూఎస్ సైతం భారత్‌కు స్నేహితుడిగా ఉంటూనే ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తోందని ఆరోపపించారు. ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘భారత్ రష్యాకు మంచి నమ్మకమైన భాగస్వామిగా నిలిచింది. భారత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి రష్యా సహకారం అందిస్తోంది. ఇది ఇలానే కొనసాగుతుంది’ అని చెప్పారు. భారత్‌కు వచ్చే యూఎస్ అధికారులు ఇరు దేశాల సంబంధాలపై దెబ్బకొట్టే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తోంది. వారు ఆంక్షలతో బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీంతో భారత్‌కు చెందిన భాగస్వాములు సైతం కొన్నిసార్లు అతిగా జాగ్రత్తపడాల్సి వస్తోంది. కానీ ఈ విధానం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా రష్యా సంబంధాలు విస్తరిస్తూనే ఉన్నాయని వెల్లడించారు. కానీ పాశ్చాత్య దేశాల్లా ఎటువంటి షరతులు విధించలేదని తెలిపారు. దేశీయ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. పరస్పరం విశ్వసనీయమైన సంబంధాలను కొనసాగించామని తెలిపారు. భారత్, రష్యాలు దశాబ్దాలుగా బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.
అధికంగా చమురు దిగుమతి
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గత18 నెలలుగా రష్యా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటిగా అవతరించింది. భారత్‌కు అధికంగా చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. అంతేగాక రష్యా అందించిన సాంకేతిక సహకారంతో భారతదేశంలోనే అతిపెద్దదైన కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ తమిళనాడులో కొనసాగుతోంది. ఇంధన భద్రత, సాంకేతిక పురోగతికి దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ, తమ అణు సహకారాన్ని మరింత పెంచుకోవాలని రెండు దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.