CBI raid: సీబీఐ దాడులతో మనస్తాపం.. పోస్టల్ అధికారి ఆత్మహత్య

సీబీఐ అధికారులు సోదాలు చేయడంతో మనస్తాపం చెందిన పోస్టల్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2024-08-21 10:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సీబీఐ అధికారులు సోదాలు చేయడంతో మనస్తాపం చెందిన పోస్టల్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అవినీతి ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ సూపరింటెండెంట్ త్రిభువన్ గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ప్రధాన పోస్టాఫీసుపై మంగళవారం అర్థరాత్రి సీబీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు దాడులు చేశారు. రిటైర్డ్ ఫీల్డ్ ఆఫీసర్ సహా ఎనిమిది మందికి పైగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోస్టల్‌ సూపరింటెండెంట్ త్రిభువన్ ప్రతాప్ సింగ్ బుధవారం ఉదయం అలీగఢ్‌లోని తన ఇంట్లో లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీబీఐ దాడులతో త్రిభువన్‌ ఒత్తిడికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ జరుపుతున్నారు. త్రిభువన్ సింగ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సూసైడ్ లెటర్ లో ఏముందంటే?

అయితే, సీబీఐ దాడులతో ఒత్తిడికి గురయ్యాడనే ఆరోపణలను మృతుడి కుటుంబ సభ్యులు ఖండించారు. తనను ఒక మహిళ, కొందరు అధికారులు తమ వద్ద పని చేయమని ఒత్తిడి తెస్తున్నారని మృతుడి సోదరుడు ఆరోపించారు. త్రిభువన్ రాసిన ఆత్మహత్య లేఖను ఆయన సోదరుడు వాట్సాప్‌లో షేర్‌ చేశాడు. తన అధికారిక లెటర్‌హెడ్‌ పై హిందీలో సూసైడ్ నోట్ రాశాడు. సూసైడ్ నోట్ లో.. చాలా మంది సహోద్యోగులు తమ ఆదేశాల ప్రకారం పనిచేయమని తనను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని రాశాడు.


Similar News