Maha Kumbh Mela: ఉత్తప్రదేశ్ లో కొత్త జిల్లాగా మహాకుంభమేళా..!

ఉత్తరప్రదేశ్‌ లో త్వరలో మహాకుంభమేళా(Maha Kumbh Mela) జరగనుంది. ఇలాంటి టైంలో యోగి సర్కారు కీలక ప్రకటన చేసింది.

Update: 2024-12-02 05:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ లో త్వరలో మహాకుంభమేళా(Maha Kumbh Mela) జరగనుంది. ఇలాంటి టైంలో యోగి సర్కారు కీలక ప్రకటన చేసింది. యూపీలో మరో జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రయాగ్‌రాజ్ జిల్లా(Prayagraj) పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి ఇకపై కొత్త గుర్తింపు రానుంది. ఈ జిల్లా పేరు మహాకుంభమేళా అని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(UP CM Yogi Adityanath) అధికారులతో సమావేశమైన తర్వాత దీనిపై ఆదేశాలు జారీ చేశారు. దాని తర్వాత ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఈ విషయాన్ని ప్రకటించింది. “జనవరిలో రాబోయే కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటైన జిల్లా పేరు మహాకుంభమేళా జిల్లాగా ” అని డీఎం ఉత్తర్వులు జారీ చేశారు.

కుంభమేళా సజావుగా సాగేందుకే..

ఇకపోతే, కుంభమేళాను సజావుగా నిర్వహించేందుకు, పరిపాలనా పనులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మహా కుంభమేళా జిల్లాలో ఇండియన్ సివిల్ సెక్యూరిటీ సెక్షన్ 14 (1) ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జిల్లా మేజిస్ట్రేట్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌లను నియమించనున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో 2025, జనవరి 13 నుండి ప్రారంభమై 2025, ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది. భారతీయ సంస్కృతిని తెలియజెప్పేందుకు మహా కుంభమేళా ఒక మైలురాయి అని అందరూ భావిస్తున్నారు. మరోవైపు, మహాకుంభమేళా సన్నాహాలను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 13న ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, సహా మౌలిక సదుపాయాలను సమీక్షించడానికి ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

Tags:    

Similar News