ఐదేళ్లు ఎండల్లో మాడిపోవాల్సిందే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

రానున్న ఐదేళ్ల పాటు మనం ఎండల్లో మాడిపోవాల్సిందే.

Update: 2023-05-17 17:21 GMT
ఐదేళ్లు ఎండల్లో మాడిపోవాల్సిందే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
  • whatsapp icon

జెనీవా: రానున్న ఐదేళ్ల పాటు మనం ఎండల్లో మాడిపోవాల్సిందే. 2023 నుంచి 2027 వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. గ్రీన్ హౌస్ వాయువులు (కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్), ఎల్ నినో ప్రభావం వల్లే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ఐరాస అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తెలిపింది. ప్రతి ఎనిమిదేళ్లకు ఒకసారి లెక్కిస్తున్న సగటు ఉష్ణోగ్రత 2015 నుంచి 2022 వరకు అత్యధికంగా నమోదైందని గుర్తు చేసింది. వాతావరణంలో మార్పు వేగవంతమైన కొద్దీ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది.

2022 నాటికి గ్లోబల్ వార్మింగ్ ను 1850-1900 మధ్య నమోదైన సగటు ఉష్ణోగ్రత కంటే కనీసం 2 డిగ్రీల సెల్సియస్ తగ్గించాలని 2015 పారిస్ ఒప్పందంలో అన్ని దేశాలు అంగీకరించాయి. కానీ.. 2022లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1850-1900 సగటు కంటే 1.15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదైనట్లు గణాంకాలు వెల్లడించాయి. 2023-2027 నాటికి ప్రపంచ ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని డబ్ల్యూఎంవో అంచనా వేసింది. ప్రతి ఐదేళ్లకు సగటున 1.1-1.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతోందని పేర్కొన్నది. ఇది ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి లభ్యత, పర్యావరణం తదితరాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని తెలిపింది.

Tags:    

Similar News