Delimitation: డీలిమిటేషన్‌కు ముందు అక్రమ వలసదారులను బహిష్కరించాలి.. మణిపూర్ బీజేపీ ఎంపీ డిమాండ్
డీలిమిటేషన్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ మణిపూర్ బీజేపీ ఎంపీ మహారాజా సనాజోబా లీషెంబా కీలక సూచన చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: డీలిమిటేషన్ (Delimitation) పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ మణిపూర్ బీజేపీ ఎంపీ మహారాజా సనాజోబా లీషెంబా (Maharaja Sanajaoba Leishemba) కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ అమలు చేసే ముందు అక్రమ వలస దారులను గుర్తించి వారిని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. గురువారం రాజ్యసభ (Rajya sabha)లో జీరో అవర్ (Zero hour) సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తారు. మణిపూర్‌లో ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా, రాష్ట్రంలోని ప్రస్తుత నియోజకవర్గాల్లో ఎటువంటి మార్పులు చేయడం సాధ్యం కాదన్నారు. చొరబాటుదారులు భారత భూభాగంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, ఇండో-మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దును ఆసరాగా చేసుకుని దేశంలోని అక్రమంగా చొరబడి ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలోని కాంగ్‌పోక్పి, టెంగ్నౌపాల్, చందేల్, చురచంద్‌పూర్ (Churachandpur) తదితర జిల్లాల్లో 1969తో పోలిస్తే 2024లో గ్రామాల సంఖ్య 731 నుండి 1624కి పెరిగిందని అన్నారు. ఇది 50 ఏళ్లలో 122 శాతం పెరుగుదల అని అన్నారు. కాబట్టి ప్రస్తుత ఎన్నికల నియోజకవర్గాల్లో డీలిమిటేషన్ ప్రక్రియపై నిర్ణయం తీసుకునే ముందు అక్రమ వలసదారులను గుర్తించి, ఎన్ఆర్సీ అమలు చేయడం ద్వారా వారి దేశాలకు పంపించడం ఎంతో అవసరమని తెలిపారు. లేకపోతే మణిపూర్‌లో భారీ జనాభా అసమతుల్యత ఏర్పడుతుందని, స్థానిక ప్రజలు తమ సొంత రాష్ట్రంలో ఎంతో నష్టపోతారని అభిప్రాయపడ్డారు.