కేంద్రం బుద్ధుడి బోధనలనే అనుసరిస్తోంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం బుద్ధుని బోధనలనే అనుసరిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2023-03-10 16:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం విదేశాంగ విధానం మొదలుకుని, రాష్ట్రాలతో అనుసంధానం వరకు ప్రతి చోట బుద్ధుని బోధనలను అనుసరిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బుద్ధుడి మంత్రం.. ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి ప్రేరణ అని ఆయన అన్నారు. బిహార్‌లోని నవ నలందా విశ్వవిద్యాలయం కులపతిగా (చాన్స్‌లర్) ఆ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవానికి కిషన్ రెడ్డి హాజరైన ప్రసంగించారు. భారతదేశానికి, బౌద్ధ మతానికి ఉన్న సంబంధం దృష్ట్యా.. ఇప్పటికీ విదేశాల నుంచి బౌద్ధమతాన్ని అనుసరించేవారు పెద్ద సంఖ్యలో నలందకు వస్తారన్నారు. భారతదేశ వైభవోపేతమైన చరిత్రకు నలందా విశ్వవిద్యాలయం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. శతాబ్దాలపాటు ప్రపంచానికి నలందా విశ్వవిద్యాలయం జ్ఞానాన్ని ప్రదానం చేసిందన్నారు. ఖిల్జీలు, మొఘలులు తర్వాత బ్రిటిషర్ల కారణంగా మన ఘనమైన వారసత్వానికి, మన సాంస్కృతిక జ్ఞాన పరంపరకు చాలా నష్టం వాటిల్లిందని కిషన్ రెడ్డి అన్నారు.

ఆ తర్వాత కూడా దశలవారిగా మన ఆత్మవిశ్వాసాన్ని ధ్వంసం చేసేందుకు ఎన్నో కుటిలయత్నాలు జరిగాయన్నారు. అయినప్పటికీ.. నాటి ఘనమైన చరిత్రను గుర్తుచేసుకుంటూనే.. ఇవాళ ఘనమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తున్నట్లు భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రధాని మోడీ ఆ విలువలనే ముందుకు తీసుకెళ్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బానిస ఆలోచనలకు పాతరేస్తూ.. జాతీయవాద భావనలతో ముందుకెళ్లాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ బైద్యనాథ్ లాభ్, పట్నా ఎన్ఐటీ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ జైన్ తో పాటుగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

స్నాతకోత్సవానికి ముందు.. కేంద్ర మంత్రి నలందా విశ్వవిద్యాలయం శిథిలాలను సందర్శించారు. అక్కడ ఏఎస్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నలంద తవ్వకాల్లో దొరికిన పురాతత్వ వస్తువులతో ఏర్పాటుచేసిన మ్యూజియంను, బౌద్ధం గురించి పాలీ, సంస్కృతం, సింహాళీ, చైనీస్, కంబోడియన్, టిబెటన్ భాషల్లోని చేతి వ్రాత ప్రతులున్న డాక్టర్ రాజేంద్రప్రసాద్ లైబ్రరీని కూడా కేంద్ర మంత్రి సందర్శించారు. నలంద ప్రాంతంలో సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు.


Tags:    

Similar News