Darranga: ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ ప్రారంభం.. సత్సంబంధాలే ముఖ్యమన్న కేంద్రమంత్రి బండి సంజయ్
అసోంలోని దరంగా బోర్డర్ వద్ద ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.
దిశ, వెబ్ డెస్క్: భారత్ - భూటాన్ దేశాల మధ్య చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. అసోం రాష్ట్రంలోని దరంగా వద్ద భారత్ - భూటాన్ సరిహద్దులో (Bharat - Bhutan Border) ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ ను (Immigration Check Post) కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రారంభించారు. భూటాన్ ప్రధానమంత్రి శెరింగె తోబ్గే, అసోం గవర్నర్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్, విదేశాంగ శాఖ సహాయమంత్రి పవిత్ర మార్గరీటా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ తో పొరుగుదేశాలతో భారత్ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. లాజిస్టిక్ ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేసుకోవడమే భారత్ అభిమతమని బండి సంజయ్ పేర్కొన్నారు. భారత్ - భూటాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రామాణికత ఏర్పడిందని, ఇరు దేశాల మధ్య స్నేహం, సహకారం, సామాజికత మన భాగస్వామ్యానికి ప్రబల సాక్ష్యమని పేర్కొన్నారు.
నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తి, సమాచారం, ఆరోగ్యం, సాంస్కృతిక మార్పిడి, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన, విద్య వంటి కీలక రంగాల్లో భారత్ విస్తరించిందని తెలిపారు. హోంశాఖ పరిధిలోని ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(LPAI) సరిహద్దుల వద్ద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక మౌలిక వసతులు, ప్రయాణికులకు, వ్యాపారులకు సౌకర్యవంతమైన, భద్రత, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తోందన్నారు. దరంగా ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ (Darranga Immigration Checkpost) ద్వారా పొరుగు దేశాలతో ఆర్థిక సహకార, సామాజిక సంబంధాల్లో నూతన అవకాశాలను సృష్టించేందుకు అవసరమైన డిజిటల్ మార్గాలను అన్వేషిస్తోందన్నారు.
సరిహద్దుల వ్యాపారంలో విప్లవాత్మక మార్పులకు, భద్రతను పెంచడానికి అత్యాధునిక వనరులను ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సమకూర్చిందన్నారు. ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (LPMS) ద్వారా ఆన్లైన్ పార్కింగ్ రిజర్వేషన్, ఆటోమేటెడ్ స్టోరేజ్, సులభతర నియంత్రణ అనుమతులు వంటి సౌకర్యాలతో ల్యాండ్ పోర్ట్ కార్యకలాపాలను డిజిటలైజ్ చేస్తుందన్నారు. ల్యాండ్ పోర్ట్‌ల విస్తరణ కేవలం రోడ్డు మార్గం వరకు పరిమితం కాదని పేర్కొన్నారు బండి సంజయ్. రైల్వే, అంతర్రాష్ట్ర జలమార్గాలను రోడ్డుకు కనెక్ట్ చేసి పొరుగుదేశాలతో మరింత వాణిజ్య సామర్ద్యాన్ని పెంపొందించడమే ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్యమన్నారు. భవిష్యత్తులో భూమి, రైల్వే, జలమార్గాలను కలిపి సరిహద్దుల మధ్య సరకు, సేవలు నిరంతరం కొనసాగేలా మద్దతు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. 2030 నాటికి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో ప్రస్తుతం ఉన్న టాప్ 25 దేశాల జాబితాలో చేరాలన్న ప్రభుత్వ విజన్ కు కూడా నేటి కార్యక్రమం బలాన్ని ఇస్తుందన్నారు.