Uniform Civil Code: 'యూసీసీతో ఈశాన్య, గిరిజనులకు నష్టం లేదు'

ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) వల్ల ఈశాన్య, ఇతర ప్రాంతాల గిరిజనుల హక్కులు, ఆచారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్ తెలిపారు.

Update: 2023-07-05 14:26 GMT

న్యూఢిల్లీ: ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) వల్ల ఈశాన్య, ఇతర ప్రాంతాల గిరిజనుల హక్కులు, ఆచారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్ తెలిపారు. యూసీసీపై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు మోడీ సర్కారు చేసిన తొలి ప్రయత్నం ఇది. గిరిజన వర్గాల వైవిధ్యం, సంస్కృతిని బీజేపీ గౌరవిస్తుందని, వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి చట్టాన్ని రూపొందించదని చెప్పారు. దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని గిరిజన మహిళకు ఇచ్చామని, తమ పార్టీలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. తాము ఎలాంటి మత, సామాజిక ఆచారాలను దెబ్బతీయాలని భావించడం లేదని, కానీ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.

రాజ్యాంగంలోని షెడ్యూల్ 6 ప్రకారం.. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలను రూపొందించామని, ఆయా రాష్ట్రాల శాసన సభలు కేంద్రం నిర్ణయాన్ని ఆమోదించపోతే వారికి ఏదీ వర్తించదని ఆయన తెలిపారు. ఏదైనా చట్టం చేసే ముందు ఇతర రాష్ట్రాల గిరిజనులను కూడా సంప్రదించి వారి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. యూసీసీ పరిధికి ఈశాన్య, ఇతర ప్రాంతాల్లోని గిరిజనులను దూరంగా ఉంచాలని రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ చేసిన ప్రకటనపై మంత్రి బఘేల్ పైవిధంగా స్పందించారు. తమ గుర్తింపు, స్వయం ప్రతిపత్తికి విఘాతం కలుగుతుందన్న భయంతో మైనారిటీలు, గిరిజనులు యూసీసీని వ్యతిరేకిస్తున్నారు. క్రైస్తవులు మెజారిటీగా ఉన్న మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో యూసీసీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది.


Similar News