Uniform Civil Code Bill: యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై కీలక అప్‌డేట్..!

యూనిఫాం సివిల్ కోడ్‌పై కీలక విషయం బయటికి వచ్చింది.

Update: 2023-06-30 10:19 GMT

న్యూఢిల్లీ : యూనిఫాం సివిల్ కోడ్‌పై కీలక విషయం బయటికి వచ్చింది. జూలై మూడో వారంలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్‌పై బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అనంతరం ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతారని.. ఆ కమిటీలోని సభ్యులు యూనిఫాం సివిల్ కోడ్‌పై వివిధ వర్గాల సంఘాల అభిప్రాయాలను సేకరిస్తారని పేర్కొంది. వీటన్నింటి కంటే ముందుగా.. జూలై 3న ఒక కీలక భేటీని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వహించబోతోంది.

దీనికి హాజరుకావాలని ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ నిపుణులకు, లా కమిషన్ సభ్యులకు బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆహ్వానాలు పంపింది. ఈ మీటింగ్ లో యూనిఫాం సివిల్ కోడ్‌ తో ముడిపడిన కీలక అంశాలపై డిస్కస్ చేయనున్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌ పై దేశంలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు జూన్ 14న లా కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన పబ్లిక్ నోటీసుకు ఏవిధమైన స్పందన వచ్చింది అనేది కూడా జులై 3న జరిగే మీటింగ్ లో చర్చించనున్నారు.


Similar News