యూసీసీ ముసాయిదా బిల్లును త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తాం : ఉత్తరాఖండ్ ప్యానెల్

ఉత్తరాఖండ్‌లో వీలైనంత త్వరగా యూనిఫాం సివిల్ కోడ్‌ (యూసీసీ)ను అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

Update: 2023-06-30 16:17 GMT

డెహ్రాడూన్/ న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో వీలైనంత త్వరగా యూనిఫాం సివిల్ కోడ్‌ (యూసీసీ)ను అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు రెడీ అయి ప్రింట్ అవుతోందని.. అతి త్వరలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వెల్లడించింది. రాష్ట్ర యూసీసీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ వివరాలను వెల్లడించారు.

తమ అధ్యయనంలో భాగంగా వివిధ మతాలకు సంబంధించిన వివాహ నియమాలు, వ్యక్తిగత చట్టాలు, లా కమిషన్ నివేదికలను అన్నింటినీ పరిశీలించామని చెప్పారు. "గత ఏడాది నుంచి స్టడీ చేస్తున్న మా కమిటీకి భారీ మద్దతు లభించింది. ప్రతి విషయంలోనూ ప్యానెల్ సభ్యులు ఏకాభిప్రాయంతో ఉన్నారు. మాకు 2.3 లక్షలకుపైగా సూచనలు అందాయి. 20,000 మందికిపైగా ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ మతాలకు చెందిన నాయకులు, ప్రజలను కలిశాం" అని ఆమె వివరించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు..?

యూనిఫాం సివిల్ కోడ్‌పై కీలక విషయం బయటికి వచ్చింది. జూలై మూడో వారంలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్‌పై బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అనంతరం ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతారని.. ఆ కమిటీలోని సభ్యులు యూనిఫాం సివిల్ కోడ్‌పై వివిధ వర్గాల సంఘాల అభిప్రాయాలను సేకరిస్తారని పేర్కొంది. వీటన్నింటి కంటే ముందుగా.. జూలై 3న ఒక కీలక భేటీని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వహించబోతోంది. దీనికి హాజరుకావాలని ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ నిపుణులకు, లా కమిషన్ సభ్యులకు బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆహ్వానాలు పంపింది. ఈ మీటింగ్ లో యూనిఫాం సివిల్ కోడ్‌ తో ముడిపడిన కీలక అంశాలపై డిస్కస్ చేయనున్నారు.

యూనిఫాం సివిల్ కోడ్‌ పై దేశంలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు జూన్ 14న లా కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన పబ్లిక్ నోటీసుకు ఏవిధమైన స్పందన వచ్చింది అనేది కూడా జులై 3న జరిగే మీటింగ్ లో చర్చించనున్నారు. ఆగస్టు 5న యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)పై మోడీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని బీజేపీ నేత కపిల్ మిశ్రా ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఆగస్టు 5న రామమందిరంపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఆగస్టు 5న యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)తో పాటు.. జై శ్రీరామ్" అని ట్వీట్ చేశారు.

రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. " మేం ఏ మతాన్ని కూడా అడ్డుకోవడం లేదు. రాజ్యాంగంలో ఏది రాసి ఉందో అదే చేస్తాం.. ఒక దేశంలో ఒకే చట్టం ఉండాలి" అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింల మత స్వేచ్ఛను హరించాలని చూస్తోందని జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ ఆరోపించారు.


Similar News