దిశ, వెబ్‌డెస్క్ః గాంధీ కోరిన స్వాతంత్య్రం భారతదేశంలో సాధ్యమేనా..?! ఓ ఆడపిల్ల ఒంటరిగానే కాదు, పట్టపగలు తండ్రితో కూడా కలిసి వెళ్లలేని పరిస్థితి నెలకొన్న ఈ సమాజంలో ఇలాంటి సందేహం పొరపాటేమీ కాదు. అందుకే, తాజాగా కేరళ హైకోర్టు ఈ పరిస్థితిపై తీవ్రంగా స్పందించింది. ఓ తండ్రి యుక్తవయసులో ఉన్న తన కుమార్తెతో రోడ్డుపై కలిసి నడవలేకపోవడం "దురదృష్టకరం" అని కోర్టు వెల్లడించింది. తండ్రీ కూతుళ్లు కలిసి నడుస్తున్నా వాళ్లు అసభ్యకరమైన మాటలు ఎదుర్కోక తప్పడంలేదని విచారం వ్యక్తం చేసింది. అయితే, ఇలాంటి ఓ కేసుకు సంబంధించి వాదనలు విన్న కోర్టు ఇలా స్పందించింది. అలాంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా అలా ఎందుకు మాట్లాడావని అడిగిన తండ్రిపై దాడి చేసిన వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి కేరళ హైకోర్టు నిరాకరించింది.
కేసు వివరాల్లోకి వెళితే, 14 ఏళ్ల తన కూతురిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకించినందుకు రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన తండ్రిని నిందితుడు హెల్మెట్‌తో కొట్టి గాయపరిచాడు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను కోరిన నిందితుడిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తండ్రి, కూతుళ్లు కూడా కలిసి నడవలేకపోవడం దురదృష్టకరమని, ఇలాంటి పరిస్థితిని ఆపాల్సిందేనని కోర్టు పేర్కొంది. పిటిషనర్-నిందితుడు కేసు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోతే, అదే రోజు అతన్ని జురిడిక్షనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని కోర్టు తెలిపింది.