మారని చైనా తీరు: అరుణాచల్‌ప్రదేశ్‌లో మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు

చైనా మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. ఇప్పటికే వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ డ్రాగన్ కొత్త వివాదానికి తెరలేపింది.

Update: 2024-04-01 07:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చైనా మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. ఇప్పటికే వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ డ్రాగన్ కొత్త వివాదానికి తెరలేపింది. భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం పేర్లను విడుదల చేసింది. చైనా పేర్లు మార్చిన ప్రదేశాల జాబితాలో 11నివాస ప్రాంతాలు, 12పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత ప్రాంతంతో పాటు కొంత భూమి కూడా ఉంది. ఈ పేర్లు చైనీస్, టిబెటన్, రోమన్ భాషల్లో రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దేనికి ఏపేరు పెట్టారనే దానిపై డ్రాగన్ స్పష్టత నివ్వలేదు.

చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను జాంగ్నావ్ అని పిలుస్తోంది. ఈ పేరుతోనే భూభాగాలకు పేర్లు వెల్లడించినట్టు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని భూభాగాల పేర్లను చైనా మార్చడం గత ఏడేళ్లలో ఇది నాలుగోసారి. 2017లో 6 స్థలాల పేర్లను, 2021లో 15 స్థలాలను, మార్చింది. గతేడాది 11 ప్రాంతాల పేర్లను చేంజ్ చేసింది.ఈ తరహా చర్యలను భారత్ పదే పదే తిరస్కరించింది. చైనా నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని తెలిపింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలను మార్చలేని వెల్లడించింది. అయినప్పటికీ చైనా పదేపదే పేర్లు మారుస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

కాగా, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో 13000 అడుగుల ఎత్తులో నిర్మించిన సెలా టన్నెల్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను అమెరికా సైతం ఖండించి భారత్‌కు మద్దతు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి చైనా పేర్లు మార్చడం గమనార్హం.

Tags:    

Similar News