UN: దండయాత్రను వివాదంగా మార్చేసింది.. ఐక్యరాజ్యసమితిపై జైశంకర్ ఆగ్రహం

కేంద్రవిదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ఐక్యరాజ్యసమితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ దండయాత్రను రెండు దేశాల వివాదంగా మార్చేసిందని మండిపడ్డారు.

Update: 2025-03-18 11:30 GMT
UN: దండయాత్రను వివాదంగా మార్చేసింది.. ఐక్యరాజ్యసమితిపై జైశంకర్ ఆగ్రహం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రవిదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ఐక్యరాజ్యసమితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ దండయాత్రను రెండు దేశాల వివాదంగా మార్చేసిందని మండిపడ్డారు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీలో‘రైసీనా డైలాగ్‌’ సమావేశం జరుగుతోంది. కాగా.. అక్కడ చేసిన ప్రసంగంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్ అంశంపై మేం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాం. అప్పుడు వారు పాక్‌ దురాక్రమణను రెండు దేశాల వివాదంగా మార్చేశారు. అందులో పలు పాశ్చాత్య దేశాల పాత్ర ఉంది.’’ అని ఆరోపణలు చేశారు. కశ్మీర్‌లో పరిస్థితిని తప్పుగా చూపించారని.. ఇది ప్రపంచం భారతదేశ సార్వభౌమత్వాన్ని చూసే విధానంపై ప్రభావితం చేసిందని జైశంకర్ మండిపడ్డారు. కశ్మీర్ సమస్య విషయంలో అనే పాశ్చాత్య దేశాలు తప్పుడు కథనాలు రూపొందించాయన్నారు. తప్పుడు కథనాలు రూపొందించడంలో యూకే, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాలు కశ్మీర్ చుట్టూ ఉన్న తప్పుడు కథనాన్ని రూపొందించాయి. దీంతో భారతదేశం ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించడం కష్టతరంగా మారిందన్నారు.

పాశ్చాత్య దేశాల ద్వంద ప్రమాణాలపై విమర్శలు

ప్రపంచ రాజకీయాల్లో పాశ్చాత్య దేశాల ద్వంద ప్రమాణాలను జైశంకర్ విమర్శించారు. “పశ్చిమ దేశాలు ఇతర దేశాల్లోకి వెళ్ళినప్పుడు అది ప్రజాస్వామ్యం కోసం. కానీ ఇతర దేశాలు అలా చేస్తే అది దుష్పభ్రావం" అని ఎండగట్టారు. అంతేకాకుండా, భారత చరిత్రను అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కశ్మీర్ సమస్యతో పాటు భారత స్వాతంత్ర్య పోరాటం.. అంతర్జాతీయ సంబంధాల పట్ల తమ విధానాన్ని ప్రభావితం చేసిందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1940ల్లో ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని భారత్ నిర్ణయించుకుందని గుర్తుచేశారు. ఇది భారతదేశ స్థితిస్థాపకతను, ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనే తమ ఆశయానికి అది నిదర్శనమన్నారు. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే దృఢసంకల్పం, ప్రముఖ గ్లోబల్ పవర్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని ప్రతిబింబించేలా జైశంకర్ ప్రసంగించారు.

Tags:    

Similar News