Ukraine war: యుద్ధాన్ని పొడిగించేందుకే అమెరికా ప్రయత్నం.. రష్యా సంచలన ఆరోపణ !

దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు అమెరికా ఉక్రెయిన్‌కు అనుమతివ్వడంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం భీకర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-11-20 12:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు అమెరికా(America) ఉక్రెయిన్‌(Ukrein)కు అనుమతివ్వడంతో రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధం భీకర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని పొడిగించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించడానికి తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నప్పటికీ యూఎస్ ఆ దిశగా ఆలోచించడం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ (Dimithri pescow) తెలిపారు. తాజాగా ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘అమెరికా పరిపాలనా పోకడలను పరిశీలిస్తే వారు ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని కొనసాగించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్టు స్పష్టమవుతోంది. అందుకోసం వారు చేయగలిగిందంతా చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని కొనసాగించేందుకే ఆయుధాల పంపిణీలోనూ వేగం పెంచిందని నొక్కి చెప్పారు. వివాదాన్ని స్థంభింపచేయడం సరికాదని, పుతిన్ చర్చలకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్‌లను త్వరలో అందజేస్తామని అమెరికా చెప్పడంపై పెస్కోవ్ స్పందించారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

Tags:    

Similar News