వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌కు తప్పిన ప్రమాదం..

రాజస్థాన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌కు పెను ప్రమాదం తప్పింది.

Update: 2023-10-02 12:02 GMT

జైపూర్ : రాజస్థాన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌కు పెను ప్రమాదం తప్పింది. ఉదయ్‌పూర్-జైపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ సోమవారం ఉదయం ఉదయ్‌పూర్ నుంచి బయలుదేరింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ట్రైన్ మార్గంలో భిల్వారా సమీపంలో రైల్వే ట్రాక్‌పై వరుసగా దాదాపు 15 అడుగుల మేర రాళ్లు, ఇనుప రాడ్లను పేర్చారు. దూరం నుంచే వీటిని గుర్తించిన ట్రైన్ డ్రైవర్లు.. వెంటనే బ్రేకులు వేసి రైలును ఆపారు. ట్రాక్ పై ఉన్న రాళ్లు, ఇనుప రాడ్లను తొలగిస్తున్న క్రమంలో.. రైలు సిబ్బంది మరో షాకింగ్ విషయాన్ని గుర్తించారు. పట్టాలను కలిపే లింక్ వద్ద రెండు ఇనుప రాడ్లను దుండగులు ఇరికించారని వెల్లడైంది.

పెద్ద రాళ్లు కింద పడకుండా ఉండేందుకు.. అటు, ఇటు రెండు రాడ్లను అమర్చారని రైల్వే సిబ్బంది నిర్ధారించారు. ఒకవేళ వీటిని గుర్తించకుండా రైలు వేగంగా వెళ్లి ఉంటే, పట్టాలు తప్పి పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని భావిస్తున్నారు. రైల్వే అధికారులు ఈ మొత్తం తతంగాన్ని ఫోన్‌లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉదయపూర్-జైపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సెప్టెంబర్ 24నే ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు.


Similar News