HMPV: మహారాష్ట్రలో మరో రెండు హెచ్ఎంపీవీ కేసులు..!
దేశంలో ‘హ్యూమన్ మెటాన్యుమో వైరస్’ (హెచ్‌ఎంపీవీ) వ్యాప్తి చెందుతోంది. మంగళవారం కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయయి.
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ‘హ్యూమన్ మెటాన్యుమో వైరస్’ (హెచ్‌ఎంపీవీ) వ్యాప్తి చెందుతోంది. మంగళవారం కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయయి. దీంతో భారత్‌లో ఇప్పటివరకు ఏడు హెచ్‌ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర (Maharashtra)లోని నాగ్‌పుర్‌లో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ నిర్ధరణ అయ్యింది. 7, 14 ఏళ్ల చిన్నారులు ఇద్దరూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దగ్గు, జ్వరం లేదా ఏదైనా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ (SARI)తో బాధపడుతున్న వ్యక్తులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇకపోతే, సోమవారం కర్ణాటకలో రెండు, తమిళనాడు రెండు, గుజరాత్‌ల ఒక కేసు నమోదైంది.
కేంద్రం ఏం చెబుతుందంటే?
అయితే, హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) సైతం పేర్కొన్నారు. ‘హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదని డాక్టర్లు స్పష్టంచేశారు. ఈ వైరస్‌ని 2001లో గుర్తించారు. చాలా ఏళ్లుగా ఇది ప్రపంచవ్యాప్తిలో ఉంది. గాలి, శ్వాసప్రక్రియ ద్వారా ఇది వ్యాపిస్తుంది. అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తోంది. ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. దేశంలోని హెల్త్ ఇన్ స్టిట్యూట్ లు, నిఘా నెట్‌వర్క్‌లు అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఆరోగ్యపరమైన సవాళ్లపై వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు’ అని నడ్డా తెలిపారు. హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ మొట్టమొదట 2001లో నెదర్లాండ్స్‌లో వెలుగులోకి వచ్చింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గతంలోనే అనేక కేసులు బయటపడ్డాయి.