MEA: కెనడాతో సంబంధాలు దెబ్బతినడానికి కారణం ఇదే..!
వేర్పాటువాదుల వల్లే భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయని భారత విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: వేర్పాటువాదుల వల్లే భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయని భారత విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్ అన్నారు. లోక్ సభలో రాతపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పరస్పర గౌరవం, సున్నిత అంశాల ఆధారంగా కెనడాతో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు భారత్ రెడీగా ఉందని వెల్లడించారు. ‘‘కెనడాలో తీవ్రవాదులు, వేర్పాటువాదులకు స్వేచ్ఛను ఇవ్వడమే ఇరు దేశాల సంబంధాల తిరోగమనానికి కారణం. ఆ దేశం నుంచి కార్యకలాపాలు సాగించే భారత వ్యతిరేకులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం పలుమార్లు కోరింది. భారత నాయకుల హత్యలను గొప్పగా చిత్రీకరించే వ్యక్తులు.. దౌత్యవేత్తలను బెదిరించే వారు.. ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసే దుండగులు.. రెఫరెండంల పేరిట భారత విభజనకు మద్దతు పలికే వారిని అడ్డుకోవాలని కోరింది’’ అని కీర్తి వర్దన్ పేర్కొన్నారు. భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా ప్రతిసారి జోక్యం చేసుకుంటుందన్నారు. దీనివల్లే అక్రమ చొరబాట్లు, వ్యవస్థీకృత నేర కార్యక్రమాలకు కెనడా వీలు కలిగించినట్లయ్యిందన్నారు. భారత ప్రభుత్వంపై కెనడా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన
2023 జూన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని న్యూఢిల్లీ తీవ్రంగా ఖండించింది. కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి భారత్ యత్నిస్తోందంటూ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసు డిప్యూటీ డైరెక్టర్ ఇటీవలే సంచలన ప్రకటన చేశారు. ఇందుకోసం భారత్ ఏఐ సాధనాలు కూడా వినియోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా.. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండగానే.. కెనడా పదేపదే భారత్ పై ఆరోపణలు చేస్తూనే ఉంది.