ఇక ఏడాదికి రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్

ఎన్ఈపీ లక్ష్యాలను చేరుకునేందుకు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఏటా టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను రెండుసార్లు..

Update: 2024-02-20 14:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు ప్రక్రియలో భాగంగా కేంద్రం విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పులను ప్రారంభించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు 10,12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు అవుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్‌ రైజింగ్‌ ఇండియా పథకం ప్రారంభం సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. '2020లో తీసుకొచ్చిన ఎన్ఈపీ లక్ష్యాలను చేరుకునేందుకు, ఈ విధానం ప్రధాన ఉద్దేశమైన విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఏటా టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను రెండుసార్లు రాయడానికి వీలు కల్పించనున్నాం. వచ్చే అకడమిక్ ఏడాది నుంచి ఇది అమలవుతుంది. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యమని, రెండుసార్లు పరీక్షలు రాసే వీలుండటం వల్ల విద్యార్థులు ఉత్తమ స్కోర్‌ను ఎంచుకోవచ్చని' మంత్రి వివరించారు.

గతేడాది విద్యాశాఖ ప్రకటించిన కొత్త కరికులం ఫ్రేమ్‌వర్క్(ఎస్‌సీఎఫ్) ప్రకారం, విద్యార్థులు మెరుగ్గా రాణించేందుకు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం మంచిదనే ప్రతిపాదన వచ్చింది. ఈ విధానంతో విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేందుకు కావాల్సినంత సమయం దొరకడమే కాకుండా ప్రమాణాలు మెరుగుపడతాయని విద్యాశాఖ పేర్కొంది.

బ్యాగ్‌లెస్ డే..

విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు, వారిని మన సంస్కృతితో అనుసంధానం చేసేందుకు, భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేయడానికి నూతన విద్యా విధానం ఉపయోగపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్‌గా మార్చేందుకు ఈ ఫార్ములా పనిచేస్తుందన్నారు. ఇదే సమయంలో విద్యార్థుల కోసం ఏడాదిలో 10 రోజులు బ్యాగ్‌లెస్ డేను ప్రవేశపెట్టాలని, పిల్లలను కళలు, క్రీడలతో పాటు ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యేలా ప్రోత్సహించాలని మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News