మణిపూర్‌లో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
అల్లరతో సతమతమవుతున్న మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: అల్లరతో సతమతమవుతున్న మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరగలేదని, ఆధిపత్యం కోసం రెండు తెగల మధ్య జరుగుతున్న పోరు అని తెలిపారు. రాష్ట్రాన్ని సాధారణ పరిస్థితికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సాయుధ పోరాటం ద్వారా సమస్య పరిష్కారం కాదని తెలిపారు. మెయితీ, కుకీలు ఆయుధాలు విడిచిపెట్టాలని సూచించారు. హింసను విడనాడాలని పిలుపునిచ్చారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నా, మణిపూర్‌లో ఉద్రిక్తతలు నెలకొనడం దురదృష్టకరమన్నారు. గత పదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో పాటు పడ్డామని గుర్తు చేశారు. కాంగ్రెస్ 60ఏళ్లలో ఈ ప్రాంతాలను పట్టించుకోలేదని విమర్శించారు. కాగా, గతేడాది మే 3 నుంచి మణిపూర్‌లో అల్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ జాతి హింసలో ఇప్పటి వరకు 219 మంది మరణించారు.