‘ఇండియా’ కూటమి జెండాపై నెక్ట్స్ మీటింగ్‌లో కీలక నిర్ణయం..

ముంబై వేదికగా ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో జరగనున్న ఇండియా కూటమి మీటింగ్‌లో తీసుకోనున్న కీలక నిర్ణయాలపై కొంత సమాచారం బయటికి వచ్చింది.

Update: 2023-08-28 12:35 GMT

ముంబై : ముంబై వేదికగా ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో జరగనున్న ఇండియా కూటమి మీటింగ్‌లో తీసుకోనున్న కీలక నిర్ణయాలపై కొంత సమాచారం బయటికి వచ్చింది. అశోక చక్రం లేని మువ్వన్నెల జెండాను ‘ఇండియా’ కూటమి జెండాగా తీసుకోవడంపై ఈసారి భేటీలో ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి. సెప్టెంబరు నుంచి కూటమి తరఫున దేశవ్యాప్తంగా నిర్వహించనున్న అన్ని ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాల్లో ఈ జెండానే వాడాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇండియా కూటమి అధికారిక లోగోను కూడా ఈ మీటింగ్‌లోనే విడుదల చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కూటమికి ఛైర్మన్‌, చీఫ్‌ కోఆర్డినేటర్‌‌లతో పాటు దాదాపు ఐదుగురు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించాలనే ప్రపోజల్ ఉందని పేర్కొన్నాయి.

రాష్ట్రాల స్థాయిలో సీట్ల సర్దుబాటు ఎలా జరగాలనే దానిపైనా చర్చిస్తారని అంటున్నాయి. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా 450 పార్లమెంటు స్థానాల్లో కూటమి తరఫున ఒకే అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నారు. తాజాగా ఇండియా కూటమి తరఫున కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, బీఎస్పీ చీఫ్ మాయావతిని సంప్రదించారని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్ సభ సీట్లలో 40 తమకే కేటాయిస్తే ఇండియాలో చేరేందుకు అభ్యంతరం లేదని బీఎస్పీ చీఫ్ షరతు పెట్టారని న్యూస్ రిపోర్ట్స్‌లో ప్రస్తావించారు. ముంబైలో జరగబోయే మీటింగ్‌లో దీనిపైనా చర్చించనున్నారు. కాగా, ఈసారి కూడా ఇండియా మీటింగ్‌కు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరవుతారని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వెల్లడించారు.


Similar News