‘హిట్ అండ్ రన్’ శిక్షలు.. డ్రైవర్లను గట్టెక్కించే ‘ఆన్‌లైన్’ ఐడియా
దిశ, నేషనల్ బ్యూరో : హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలను డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టు సంస్థల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంచి ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో : హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలను డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టు సంస్థల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంచి ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. డ్రైవర్లు ఎవరికైనా యాక్సిడెంట్ చేసి పారిపోతే హిట్ అండ్ రన్ కేసు నమోదవుతుంది. దీనికి గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల దాకా జరిమానా విధించొచ్చని కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చెబుతోంది. ఈ సెక్షన్ నుంచి విముక్తి పొందేందుకుగానూ ట్రక్కు డ్రైవర్లు.. ప్రమాదం జరిగిన విషయాన్ని అధికారులకు వెంటనే తెలియజేసే ఆన్‌లైన్ సాంకేతిక వ్యవస్థను వినియోగించేందుకు అనుమతించాలని రవాణా శాఖ ప్రపోజ్ చేసింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి కనీసం 25 - 50 కి.మీ పరిధిలో ఉన్న పోలీసులకైనా ఆన్‌లైన్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేయొచ్చని పేర్కొంది. అలా చేస్తే.. అది ‘హిట్ అండ్ రన్’ కేసుగా పరిగణనలోకి రాదని కొత్త చట్టం చెబుతోంది. ట్రక్కు డ్రైవర్లకు ఈవిధమైన వెసులుబాటును కల్పించాలని కేంద్ర హోంశాఖకు సూచించామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ వెల్లడించారు. దీనిపై తుది నిర్ణయం హోం శాఖే తీసుకుంటుందని పేర్కొన్నారు.