బీజేపీలో చేరాలంటే ఆ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే!

మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఎలక్షన్స్‌లో ఎలా గెలవాలనేదానిపై ఫోకస్ పెట్టాయి.

Update: 2024-01-02 10:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఎలక్షన్స్‌లో ఎలా గెలవాలనేదానిపై ఫోకస్ పెట్టాయి. ప్రత్యర్థులను ఎలా ఓడించాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నాయి. దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీయేను ఎలాగైనా ఓడించాలని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ప్రణాళికలు రచిస్తోంది. మరోసారి దేశంలో మెజారిటీ సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో చేరాలంటే అధిష్టానంతో చర్చించి.. జాయిన్ అయ్యేవారు. కానీ లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీలో ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక నుంచి బీజేపీలో చేరడానికి వచ్చే ఇతర పార్టీల నేతలను పరిశీలించాలని, వారి ఇమేజ్‌ను అంచనా వేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఓ కమిటీని నియమించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. లోక్ సభ ఎన్నికల వ్యూహాలు, అయోధ్య రామమందిర ప్రతిష్టాపనపై చర్చిచేందుకు సోమవారం బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, అసోం సీఎం హిమంత బిస్వ శర్మ, తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ ఉన్నారు. ఈ భేటీలోనే చేరికలకు కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.

జనవరి 6న తొలిసమావేశం

కొత్తగా ఏర్పాటయ్యే కమిటీ జనవరి 6న తొలిసారి సమావేశం నిర్వహించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో విధి విధానాలు ఖరారు చేయనున్నారు. ఇక నుంచి పార్టీలో చేరే నేతల బయోడేటాను పరిశీలించిన తర్వాత కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పార్టీలోకి స్వాగతం పలకనున్నారు. ఇతర పార్టీ నాయకులు బీజేపీలో చేరడానికి సంప్రదింపులు జరపాలన్నా, ఏదైనా షరతులు విధించాలన్నా ఈ కమిటీని సంప్రదించాల్సి ఉంటుంది. కొందరు లీడర్లు ఎన్నికలకు ముందు పార్టీలో చేరి తర్వాత పార్టీ ఫిరాయిస్తున్నారని, దీని వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అంతేగాక పార్లమెంటు ఎన్నికలకు ముందు కూడా ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో నెగిటివ్ టాక్ వచ్చే చాన్స్ ఉందని, అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News