ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దు పెట్టడంపై విరుచుకుపడ్డ టీఎంసీ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచార స్పీడ్‌ను పెంచారు
దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచార స్పీడ్‌ను పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ఎంపీ యువతికి ముద్దు పెట్టిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. బీజేపీకి చెందిన ఖగేన్ ముర్ము ఉత్తర మాల్దా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే నియోజకవర్గ పరిధిలోని శ్రీహిపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ ఒక యువతి చెంపపై ముద్దు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇప్పుడది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఈ ఘటనను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ''ఖగేన్ ముర్ము ఒక మహిళను ముద్దుపెట్టుకున్నాడు, రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు, బెంగాలీ మహిళలపై అసభ్యకరమైన పాటలు రాసే నాయకుల వరకు అందరూ బీజేపీ వారే, నారీమణులకు మోడీ పరివార్ ఇస్తున్న గౌరవం ఇది, ఒకవేళ వీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి'' అని టీఎంసీ విమర్శలు చేసింది.
అయితే దీనిపై ఖగేన్ ముర్ము స్పందించారు. "ఆమె నా కుమార్తె లాగా భావించా. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి, కావాలనే దీనిని వివాదం చేస్తున్నారని" మండిపడ్డారు. అలాగే దీనిపై ఆ యువతి కూడా స్పందించింది. 'సొంత కుమార్తెలా భావించి ఆయన ముద్దు పెడితే దానిలో తప్పేముంది? ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిది చెత్త మనస్తత్వం. ఆ ఫొటో తీసిన సమయంలో మా అమ్మానాన్న కూడా అక్కడే ఉన్నారని' ఆ యువతి చెప్పింది.