బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ అరాచకం : Narendra Modi
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో దీదీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రక్తంతో ఆడుకుందని ఆరోపించారు. "టీఎంసీ పార్టీ పోలింగ్ బూత్‌ల ఆక్రమణ కోసం గూండాలకు కాంట్రాక్టులు ఇచ్చింది. ఓట్ల లెక్కింపు రోజున ఎన్నో పోలింగ్ బూత్ ల ను స్వాధీనం చేసుకుంది. అమాయకులపై ప్రాణాంతక దాడులను చేయించింది" అని ప్రధాని పేర్కొన్నారు. శనివారం బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్ సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రతిపక్షాలను భయపెట్టేందుకుగానూ అధికార టీఎంసీ.. హింస, బెదిరింపులను ఆయుధాలుగా వాడుకుందన్నారు. "ఎంతోమంది బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకుండా టీఎంసీ అడ్డుకుంది. బీజేపీ కార్యకర్తలను, సామాన్య ప్రజలను టీఎంసీ నేతలు, కార్యకర్తలు బెదిరించారు. ఇన్ని రకాల బెదిరింపులు ఎదురైనా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలకు నా అభినందనలు" అని మోడీ చెప్పారు. బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను వాడకపోవడంపై ఆయన స్పందిస్తూ.. "ప్రజాస్వామ్యానికి తమను తాము చాంపియన్లుగా అభివర్ణించుకునే వారే ఈవీఎంలను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారు" అని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు భయపడబట్టే.. "ఇండియా" కూటమిలోని పార్టీలు లోక్ సభలో ఓటింగ్ జరగడానికి ముందే వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించబోము
భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అవినీతి వల్ల ప్రజల జీవన నాణ్యత క్షీణిస్తుందన్నారు. కోల్‌కతాలోనే జరిగిన జీ20 దేశాల మంత్రులతో నిర్వహించిన యాంటీ కరప్షన్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. "అవినీతి నిర్మూలన కోసం పోరాడటం అనేది మా ప్రజల పట్ల మా పవిత్ర కర్తవ్యం" అని మోడీ తెలిపారు. పారదర్శక, జవాబుదారీతనం కోసమే అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో టెక్నాలజీ, ఈ-గవర్నెన్స్ లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. లక్షలాది మంది సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆయుధాలు, ఇతర యంత్రాలను కొనేటప్పుడు అవినీతికి లేకుండా ఈ-మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2018లో తీసుకొచ్చిన ఆర్థిక నేరగాళ్ల చట్టం అమలుతో.. ఆర్థిక నేరగాళ్లు, పరారైన వ్యక్తుల నుంచి 1.8 బిలియన్ డాలర్లకుపైగా రాబట్టినట్లు వివరించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం 2014 నుంచి ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన 12 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. ఈ నెల 9న కోల్‌కతాలో ప్రారంభమైన జీ20 యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు శనివారంతో ముగిశాయి.