Threat Call: జమ్మూ- జోధ్‌పూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు
జమ్మూ- జోధ్‌పూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు రైలును నిలిపివేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూ- జోధ్‌పూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు రైలును నిలిపివేశారు. జమ్మూ నుండి జోధ్‌పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు ఫోన్ రావడంతో రైల్వే అధికారులు ఫిరోజ్‌పూర్‌లోని కాసు బేగు స్టేషన్‌లో రైలును నిలిపివేసి, పోలీసులకు సమాచారం అందించారు. అకస్మాత్తుగా రైలు ఆగిపోవడంతో విషయం తెలుసుకున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందాలు ప్రయాణికులను రైలు నుంచి ఖాళీ చేయించారు. అనంతరం ఫిరోజ్ పూర్ పోలీసులు, మూడు బాంబ్ స్క్వాడ్ బృందాలు రైలులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఫిరోజ్‌పూర్ ఎస్‌ఎస్‌పి సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. "కాసు బేగు రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేసినట్లు ఫిరోజ్‌పూర్ పోలీసులకు సమాచారం అందిందని, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ప్రయాణికులను ఖాళీ చేయించారని తెలిపారు. అలాగే బెదిరింపు ఫోన్ కాల్ పై విచారణ జరుపుతున్నామని, బాంబ్ స్క్వాడ్ బృంధాలతో తనిఖీలు చేపట్టామని వెల్లడించారు.