రాహుల్ కంటే ముందు లోక్‌సభ నుంచి డిస్ క్వాలిఫై అయిన బడా నేతలు వీళ్లే!
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2019 నాటి కేసులో రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షతో రాహుల్ తన పదవిని కోల్పోబోతున్నారా అంటూ నిన్నటి నుంచి చర్చ జరుగుతున్న వేళ అనూహ్యంగా లోక్ సభ రాహుల్ గాంధీని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తో సహా పలు విపక్షాలు భగ్గుమంటున్నాయి. రాహుల్ విషయంలో లోక్ సభ సిబ్బందిది తొందరపాటు చర్య అని కొంతమంది అభిప్రాయపడుతుంటే ఇదంతా పక్కా స్కెచ్ ప్రకారం రాహుల్ ను సభ నుంచి బయటకు పంపేలా అనర్హత వేటుకు బీజేపీ ప్లాన్ చేసిందని మరి కొంత మంది చెబుతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం ఎదైనా కేసులో దోషిగా తేలి రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడితే అలాంటి వారు తమ లోక్ సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో జైలు శిక్ష పడి చట్టసభల్లో ఇప్పపటి వరకు సభ్యత్వం కోల్పోయిన నేతలపై జోరుగా చర్చ జరుగుతోంది.
డిస్ క్వాలిఫై నేతలు వీరే:
మొహమ్మద్ ఫైజల్: లక్షద్వీప్ ఎంపీగా ఉన్న ఫైజల్ 2023 జనవరి 13న ఓ హత్య కేసులో సెషన్ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. దీంతో తన పదవికి అనర్హుడిగా మారారు.
లాలూ ప్రసాద్ యాదవ్: పశుగ్రాసం కేసులో 2013లో వచ్చిన తీర్పుతో ఆర్జీడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ సైతం తన లోక్ సభ సభ్యత్వానికి దూరం కావాల్సి వచ్చింది.
ఆజం ఖాన్: 2019లో ద్వేషపూరిత ప్రసంగం కేసులో రాంపూర్ కోర్టు ఆజం ఖాన్ ను దోషిగా ప్రకటించడంతో యూపీ అసెంబ్లీ ఇతడిపై అనర్హత వేటు వేసింది.
జయలలిత: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సైతం ఈ అనర్హత వేటు తప్పలేదు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు రూ.100 కోట్ల జరిమానా విధించడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దాంతో ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. 2015లో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో తిరిగి సీఎం పదవి చేపట్టారు.
వీరితో పాటు తమిళనాడుకు చెందిన డీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ టీఎం సెల్వ గణపతి, మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ హల్వాంకర్, ఉల్హాస్ నగర్ ఎమ్మెల్యే పప్పూ కహానీ, బిహార్లోని జహానాబాద్ ఎంపీ జగ్ దీష్ శర్మ, కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్, మధ్యప్రదేశ్ లో బిజావర్ ఎమ్మెల్యే ఆశారాణి, ఝార్ఖండ్ ఎమ్మెల్యే ఎనోస్ ఎక్కా, లోహర్ దర్గా ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్, శివసేనా ఎమ్మెల్యే బాబన్ రావు ఘోలాప్ లు వివిధ కేసుల్లో దోషులు గా తేలి తమ చట్టసభల్లో అనర్హత వేటు ఎదుర్కొన్నారు.