Bridge : రోడ్డు, నది లేదు.. కానీ బ్రిడ్జి నిర్మాణం! గ్రామస్తుల ఆగ్రహం.. ఎక్కడంటే?
బీహార్ రాష్ట్రంలో ఇటీవల వంతెనలు కూలిన ఘటనలు మరువక ముందే మరో ఆసక్తికర వంతెన కథ వెలుగులోకి వచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్ రాష్ట్రంలో ఇటీవల వంతెనలు కూలిన ఘటనలు మరువక ముందే మరో ఆసక్తికర వంతెన కథ వెలుగులోకి వచ్చింది. అరారియాలో జిల్లా రాణిగంజ్ బ్లాక్ పరిధిలోని పర్మానంద్‌పూర్ గ్రామంలో గ్రామీణ పనుల విభాగం ఆరు నెలల క్రితం వంతెనను ఓ వంతెన నిర్మించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రోడ్డు కనెక్టివిటీ లేని వ్యవసాయ భూమిలో వంతెనను నిర్మించారు. దీంతో నదిపై కాకుండా పొలం మధ్యలో ఎలా నిర్మిస్తారని గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ వంతెన నిర్మాణంలో అవినీతి జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. నదిలో కాకుండా ప్రైవేటు భూమిలో వంతెన నిర్మించారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు లేదు, నది కూడా లేని స్థలంలో వంతెన నిర్మాణం చేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అరారియా జిల్లా మేజిస్ట్రేట్ ఇనాయత్ ఖాన్ తాజాగా విచారణకు ఆదేశించారు. ఓ నిపుణుల బృందం వంతెన నిర్మాణ స్థలాన్ని సందర్శిస్తోంది. నివేదిక అందిన తర్వాత నిజమని తేలితే ఇంజనీర్లతో సహా అధికారులపై చర్యలు తీసుకుంటామని ఇనాయత్ ఖాన్ తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇది నిర్మించబడిందని, ఇది బ్రిడ్జి కాదని, బ్రిడ్జి అవసరాలకు, కింద జలమార్గాల నిర్వహణకు ఉపయోగించే 'బాక్స్ కల్వర్ట్' అని గ్రామీణ పనుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ చెబుతున్నారు. "కొందరు గ్రామస్తులు కాంట్రాక్టర్ నుంచి డబ్బు డిమాండ్ చేశారు.. అతను ఇవ్వకపోవడంతో, వారు దాని కల్పిత ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారని ఆయన ఆరోపించారు.